raghu-rama-krishna-rajuవైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వేలెత్తి చూపినా రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి అందుకు నేనే పెద్ద ఉదాహరణ అంటారు ఏపీకి దూరంగా పారిపోయి ఢిల్లీలో ఉంటున్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఇంతకాలం వైసీపీ ప్రభుత్వం టిడిపి నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకొని వేదిస్తోందని, ఇప్పుడు దాని దృష్టి జనసేన నేతలు, కార్యకర్తలపై పడిందని, కనుక ఇక నుంచి వారు అప్రమత్తంగా ఉండాలని రఘురామ కృష్ణరాజు హెచ్చరించారు. వాతావరణ శాఖ ముందుగా ప్రజలను ఎలా హెచ్చరిస్తుంటుందో అదేవిదంగా తాను జనసేన నేతలు, కార్యకర్తలకు సిఐడీ పోలీసులు మీ తలుపు తట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నానని, ప్రస్తుతం వారందరూ చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారని గ్రహించాలని రఘురామ కృష్ణరాజు అన్నారు. కనుక రాష్ట్రంలోని టిడిపి, జనసేన, ఇతర ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతిని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను కలిసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.

పవన్‌ కళ్యాణ్‌ విశాఖలో ర్యాలీ, జనవాణి నిర్వహించడానికి అనుమతించని పోలీసులు, వైసీపీ నేతల విశాఖ గర్జన సభకు ఎలా అనుమతించారని రఘురామ ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎంత హడావుడి చేసినా వారి గర్జన సభకు 5,000 మందికి మించి జనం రాలేదని అన్నారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ కోసం వేలాదిమంది స్వచ్ఛందంగా తరలివచ్చారని, రెండు వీడియోలు చూస్తే ఆ విషయం అర్దం అవుతుందని రఘురామ అన్నారు. తమ సభకు జనసమీకరణ చేసినా పెద్దగా జనాలు రాకపోవడం, పవన్ పిలవకపోయినా వేలాదిమంది తరలిరావడంతో వైసీపీ నేతలు అసూయతో రగిలిపోతున్నారని, అందుకే పవన్‌ కళ్యాణ్‌ని హోటల్‌ గదిలో నుంచి బయటకి రాకుండా పోలీసులతో కట్టడి చేశారని రఘురామ ఎద్దేవా చేశారు. అయినప్పటికీ వేలాదిమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ బస చేసిన హోటల్‌లో బయట ఆయన కోసం వేచి చూశారన్నారు. పవన్-జగన్ సభలకు ఇదే తేడా అని రఘురామ అన్నారు. ఒకవేళ ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే వ్యవహరించి ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేయగలిగి ఉండేవారా? అని ప్రశ్నించారు.

రాజధానికి రోడ్, వాయు (వైమానిక) కనెక్టివిటీలు ఉండాలనుకోవడం సమంజసమే కానీ ‘సీ కనెక్టివిటీ’ కూడా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడమే చాలా విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌, దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలో పలు రాష్ట్రాలలో సముద్రం లేదనే సంగతి విద్యాశాఖ మంత్రి బొత్సకు తెలియదా?మరి ఆయా రాష్ట్రాలలో రాజధానులు లేవా?అని ప్రశ్నించారు. అమరావతి-మూడు రాజధానులలో ఏది సరైనదో తేల్చేందుకు విశాఖలోనే మీడియా, మేధావులు, అఖిలపక్ష నేతలతో రౌండ్ తెబిల్ సమావేశం ఏర్పాటు చేస్తే నేను కూడా వచ్చి నా వాదనలు వినిపిస్తానని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.

Watch and Subscribe for Exclusive Industry Interviews: