Raghu Rama Krishna Rajuఅమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు అరసవిల్లికి మహాపాదయాత్ర చేస్తుంటే, అహంకారం నెత్తికెక్కిన కొంతమంది మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు వారందరూ కమ్మలని… టిడిపి పెయిడ్ ఆర్టిస్టులని వాళ్ళని నానా రకాలుగా అవమానిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విశాఖను రాజధాని చేయాలని ‘నాన్-పోలిటికల్ జేయేసీ’ ముసుగులో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు జనసమీకరణ చేసి నేడు విశాఖ గర్జన పేరుతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. మరి దీనికి తీసుకువచ్చినవారందరూ ఎవరని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

బలవంతంగా స్కూళ్ళు మూయించి విద్యార్థులను, భయపెట్టి, బెరించి డ్వాక్రా మహిళలను, ఇరుగుపొరుగు జిల్లాల నుంచి బస్సులు, లారీలలో జనసమీకరణ చేసి జనాలను తీసుకువచ్చిన మాట వాస్తవం కాదా? అని రఘురామ ప్రశ్నించారు. తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం మంత్రులు, వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడారని వారికి ఎవరో కాదు ఉత్తరాంద్ర ప్రజలే తగినసమయంలో తగిన విదంగా బుద్ధి చెపుతారని రఘురామ కృష్ణరాజు హెచ్చరించారు. విశాఖ రాజధానిగా చేయాలని మాట్లాడే విజయసాయి రెడ్డి ఈ గర్జన సభలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రోడ్లమీద గుంతలు కూడా పూడ్చలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉందని రఘురామ కృష్ణరాజు అన్నారు.

తన సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చేయబడి నాలుగేళ్ళవుతున్నా ఆ కేసును ఇంతవరకు సిఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తేల్చడం లేదని రఘురామ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సిఎం జగన్మోహన్ రెడ్డి మౌనం అనుమానాలకు తావిస్తోందని రఘురామకృష్ణ రాజు ఆరోపించారు.