raghu-rama-krishna-rajuజగన్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించి, పోలీసుల చేత చిత్రవధ చేయించిందని, తనను రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా చేసిందని వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగాలు, చదువులు, సంక్షేమ పధకాల గురించి సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్దాలే. నేను ఎంపీని. నా నియోజకవర్గంలో స్వాతంత్ర్య దినోత్సవేడుకలలో పాల్గొనాలని కోరుకొన్నాను. కానీ జగన్ ప్రభుత్వం నన్ను రాష్ట్రంలోనే అడుగు పెట్టనీయడం లేదు. ఓ పక్క నా స్వేచ్చాస్వాతంత్ర్యాలను అడ్డుకొంటూ, సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తన ప్రసంగంలో స్వేచ్చా స్వాతంత్ర్యం అంటూ నీతులు వల్లించడం సిగ్గుచేటు.

ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు పణంగా పెట్టి మనకు స్వాతంత్ర్యం సాధిస్తే, ఓ ఎంపీనైన నేను నా రాష్ట్రంలో, నా నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా చేస్తున్నారంటే ఇక స్వేచ్చా, స్వాతంత్ర్యం ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎవరైనా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారికీ నాగతే పడుతుంది. మళ్ళీ మరోసారి జగన్మోహన్ రెడ్డి ఏపీలో అధికారంలోకి వస్తే ప్రజలందరూ పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రానికో మరో రాష్ట్రానికో వలసలు వెళ్ళిపోవలసివస్తుంది. కనుక ప్రజలు ఎవరికి వారు అల్లూరి సీతారామరాజులా పోరాడుతారో లేదా నాలాగ గాంధేయవాదుల్లా ఉద్యామిస్తారో ఆలోచించుకోవాలి,” అని అన్నారు.

ఒక ఎంపీ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి తన సొంత రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగలేక ఢిల్లీలో ఉండిపోవలసి వచ్చిందంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది?తెలంగాలో ఓ ఇన్‌స్పెక్టర్ బిజెపి ఎంపీ బండి సంజయ్‌ కాలర్ పట్టుకొన్నందుకు కేంద్ర హోంశాఖ తీవ్రంగా స్పందించింది. లోక్‌సభ స్పీకర్ కూడా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు పంపించి సంజాయిషీ కోరారు. కానీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిసి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఇంకా దారుణం.