KCR_Jaganతెలంగాణ సాధన కోసం ప్రాంతీయతత్వం విధానంగా చేసుకొని పోరాడిన కేసీఆర్‌ ఇప్పుడు భారత్‌ కోసం జాతీయవిధానంతో ముందుకు సాగుతానని చెప్పుకొంటున్నారు. కానీ నేటికీ తెలంగాణలో ఏ ఎన్నికలొచ్చిన్నా కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తూనే ఉంటారు. కనుక ఆయన చెప్పే జాతీయవాదం కేవలం ప్రజలని మభ్యపెట్టేందుకే చెపుతున్న మాటగా భావించవచ్చు.

కేసీఆర్‌ జాతీయవాదంతో ముందుకు సాగాలనుకొంటే, ముందుగా పొరుగు రాష్ట్రమైన ఏపీతో నీళ్లు, ఆస్తులు, అప్పులు, ప్రాజెక్టులపై వివాదాలను పరిష్కరించుకోవాలి. కానీ వాటిపై నేటికీ ఆయన ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోరాడుతున్నప్పుడు ఆయనది జాతీయవాదం ఎలా అవుతుంది?

ఆయన దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడం కోసమే జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నాననేది కూడా నమ్మశఖ్యంగా లేదు. ఆయన కుటుంబంపైనే అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఇక వివిద రాష్ట్రాలలో ఆయన కలిసి పనిచేయబోతున్న పార్టీలపై, వాటి నేతలపై కూడా అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అటువంటి వారందరూ కలిసి దేశంలో అవినీతిని నిర్మూలిస్తాం. గుణాత్మకమైన మార్పు తెస్తామని చెపుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.

ఏది ఏమైనప్పటికీ కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం ఖాయం అయిపోయింది కనుక ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తితో స్నేహం చేయాలనుకోవడం, ఏపీలో కాపు సామాజికవర్గాన్ని చీల్చడంలో కేసీఆర్‌ ఆయనకి తోడ్పడటం రెండూ మంచివి కావని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అభిప్రాయం చేశారు. రాజకీయాలలో ప్రసంగాలకి, ఆచరణకి ఎప్పుడూ పొంతన ఉండదని చెప్పడానికి ఇదే ఓ నిదర్శనం. ఏపీలో కులసమీకరణాలని వాడుకొని లబ్ది పొందాలని చూస్తున్న కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలనే తన లక్ష్యాన్ని చేరుకొనేందుకు రేపు ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి వ్యూహాలే అమలుచేయడం ఖాయం.

ఒకప్పుడు తెలంగాణ కోసం బొద్ది పురుగునైనా ముద్దాడటానికి తాను వెనుకాడనని కేసీఆర్‌ అనేవారు. ఇప్పుడూ అదేవిదంగా ప్రధానమంత్రి కావాలనే తన లక్ష్య సాధన కోసం కేసీఆర్‌ ఎవరితోనైనా స్నేహం చేసేందుకు సిద్దపతున్నారని చెప్పవచ్చు. కనుక కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్‌తో స్నేహం లేదా లోపాయికారిగా అవగాహన చేసుకోవడం అసహజమేమీ కాదు.

అయితే ఆయన గతంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ వంటి పలువురిని నెచ్చెనగా వాడుకొని తన లక్ష్యం సాధించిన తర్వాత వారిని ఏవిదంగా పక్కన పడేశారో ఇప్పుడు ప్రధాని అయ్యేందుకు ఆయనకు సహకరిస్తున్నవారికీ రేపు అదే గతి పట్టవచ్చు. కనుక ఆలోచించుకోవలసింది కేసీఆర్‌ కాదు. ఆయనతో దోస్తీ చేయాలని తహతహలాడుతున్నారే!కనుక ఎంపీ రఘురామకృష్ణ రాజే తన వ్యాఖ్యలని సవరించుకోవలసి ఉంటుంది.