Raghu-Rama-Krishna-Raju CBIవైసీపీ ప్రభుత్వం మీద ఇప్పటికే జగన్‌ అక్రమాస్తుల కేసు, వి‌వేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులు కత్తుల్లా వ్రేలాడుతున్నాయి. ఏక్షణంలో ఏ కేసు విచారణ వేగం పుంజుకొంటుందో… ఎవరెవరు లోనికి వెళ్ళాల్సివస్తుందో తెలీని పరిస్థితి. పైగా మరోపక్క ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి.

సరిగ్గా ఇటువంటి సమయంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇదివరకు ఎప్పుడో హైకోర్టులో వేసిన కేసు నేడు విచారణకు వచ్చింది. ఏపీ సిఐడీ పోలీసులు తనపై అక్రమంగా కేసు బనాయించి, అరెస్ట్‌ చేసి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. ఆనాడు తనను హింసిస్తున్నప్పుడు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ దానిని తన మొబైల్ ఫోన్‌ ద్వారా సిఎం జగన్మోహన్ రెడ్డికి వీడియో చూపించారని, రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు.

రఘురామకృష్ణ రాజుని కస్టడీలో తీసుకొంటున్న సమయంలో ఆ తర్వాత కాల్ డాటాను భద్రపరచాలని సీఈడీ పోలీసులను ఆదేశించవలసిందిగా కోరారు. సాధారణంగా టెలికాం కంపెనీలు రెండేళ్ళపాటు కాల్ డాటాను భద్రపరుస్తాయని కనుక ఆ రికార్డులను తొలగించకమునుపే భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణలో ఆ కాల్ డాటా చాలా కీలకమని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశం మేరకు ఆనాడు రఘురామకృష్ణరాజుకి సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరిపించగా ఆయనకు గాయాలైన్నట్లు వైద్యులు ధృవీకరించారు కూడా.

ఆ కేసుపై నేడు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, రఘురామకృష్ణరాజుని కస్టడీలో హింసించిన ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆనాటి కాల్ డాటాను తక్షణం సీబీఐకి అప్పగించాలని ఏపీ సీఈడీ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వారి వద్ద నుంచి ఆనాటి కాల్ డాటాను తక్షణం స్వాధీనం చేసుకోవలసిందిగా సీబీఐని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది.

ఎంపీ రఘురామకృష్ణరాజుని కస్టడీలో హింసించిన ఘటనపై సీబీఐ విచారణ మొదలుపెడితే ఇది వివేకా కేసులా చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ కేసులో రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నట్లు ఆయనను హింసిస్తున్నప్పుడు సిఐడీ అధికారి వీడియో తీస్తూ సిఎం జగన్మోహన్ రెడ్డి చూపించడం నిజమైతే మరింత పెద్ద సమస్యలో చిక్కుకొంటారని వేరే చెప్పక్కరలేదు.

అయితే వివేకాహత్య కేసుతోనే చెడుగుడు ఆడేసుకొంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఇది చాలా చిన్న కేసనే చెప్పొచ్చు. కనుక దీనిని ఎలా హ్యాండిల్ చేయాలో వైసీపీకి తెలీదనుకోవడం అవివేకం, అజ్ఞానమే అవుతుంది.