Radhika Kumaraswamyరాధికా కుమారస్వామి… కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రికి రెండో భార్య. గతంలో దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా కూడా నటించారు. నిన్నమొన్నటి వరకూ ఎవరికీ పెద్దగా తెలియని ఈ పేరు ఇప్పుడు గూగుల్ టాప్ సెర్చ్ ట్రెండింగ్ లో ఉంది. రాజకీయాల్లో ఈమె లేకున్నా, రాధికకు ఉన్న సినిమా నేపథ్యం, ఇప్పుడామెను దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది. ఇక రాధిక గురించిన మరింత ఆసక్తికర సమాచారాన్ని నెటిజన్లు వెతుకుతున్నారు.

తన 16వ ఏటనే తొలిసారిగా వెండితెరపై కనిపించిన రాధిక, మొదట శాండల్ వుడ్ ను తన అందంతో ఊపేశారు. ఆమె నటించిన నీలమేఘ శ్యామ, నినగాగి, తావరిగె బా తంగీ, ప్రేమఖైదీ, రోమియో జూలియెట్ చిత్రాలు 2002లో విడుదల కాగా, ఒక్కసారిగా అగ్రహీరోయిన్ గా ఎదిగిపోయారు. 2006 వరకూ ఆమె కనీసం ఏడాదికి ఐదు సినిమాల్లో తగ్గకుండా నటించారంటే, ఆమె హవా ఎలా సాగిందో తెలుసుకోవచ్చు.

ఇక నందమూరి తారకరత్న హీరోగా ఒకేసారి 9 చిత్రాలకు కొబ్బరికాయ కొట్టిన వేళ, ‘భద్రాద్రి రాముడు’ చిత్రంలో రాధికే హీరోయిన్. ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించకపోయినా, ‘అరుంధతి’ సూపర్ హిట్ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన గ్రాఫిక్స్ చిత్రం ‘అవతారం’లో రాధిక హీరోయిన్ గా నటించారు. కాగా, రాధికా కుమారస్వామి గురించి ఖతార్, యూఏఈ, శ్రీలంక, కువైట్ లలో సైతం నెటిజన్లు ఇప్పుడు వెతుకుతున్నారని గూగుల్ వెల్లడించింది.