Radhe-Shyam openings“బాహుబలి”తో ఇండియన్ స్టార్ గా అవతరించిన తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు రెండు సినిమాలు చేసారు. “సాహో” సినిమా బాక్సాఫీస్ వద్ద నిరుత్సాహకారమైన ఫలితాన్ని చవిచూసినప్పటికీ, బాలీవుడ్ నాట ప్రభాస్ కున్న క్రేజ్ ను చాటిచెప్పే విధంగా బాక్సాఫీస్ కలెక్షన్స్ ఉన్నాయి. దీంతో “రాధే శ్యామ్” కూడా అలాంటి ఫీట్ నే రిపీట్ చేస్తుందని అంతా భావించారు.

మరి “రాధే శ్యామ్” ప్రభాస్ కున్న క్రేజ్ ను రెట్టింపు చేయడానికి దోహదపడిందా? కలెక్షన్ల పరంగా మునుపటి “సాహో” సినిమాను దాటిపోతుందా? అంటే అలాంటి అవకాశాలు లేవన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో బలంగా వినపడుతోంది. నిజానికి అంచనాలు వేసిన దాని కంటే చాలా తక్కువ స్థాయిలో “రాధే శ్యామ్” ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఉన్నాయనేది నిరుత్సాహకరమైన అంశం.

తెలుగుతో పాటు ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమా నిరుత్సాహపరిచిందంటూ రివ్యూలు ఇవ్వడం, ప్రభాస్ యాక్షన్ ఇమేజ్ కు తగిన స్టోరీ కాకపోవడంతో, బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సారి ఆశించిన ఫలితాన్ని అందివ్వకపోవచ్చన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. హిందీ నాట పరిస్థితి ఇలా ఉంటే, తెలుగులో ఏ రకమైన ఓపెనింగ్స్ వచ్చాయి అన్న ఆసక్తి కలగడం సహజమే.

ఇటీవల పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” విడుదల సందర్భంగా నైజాంలో ఓపెనింగ్ డే రోజున ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. దీనిని ‘రాధే శ్యామ్’ అవలీలగా దాటుతుందని భావించగా, అందుకు విరుద్ధంగా ఫైనల్ కలెక్షన్స్ నిలిచాయి. ‘భీమ్లా, పుష్ప’ల తదుపరి స్థానంలో ‘రాధే శ్యామ్’ నిలవడం ఈ సినిమా ఓపెనింగ్స్ కు అద్దం పడుతోంది.

ప్రభాస్ కెరీర్ లో మునుపటి “సాహో” కలెక్షన్స్ ను అయితే అవలీలగా దాటింది గానీ, ఆల్ టైం రికార్డుకు రెండు అడుగుల దూరంలో నిలిచిపోయింది. పక్కా క్లాస్ మూవీ కావడంతో, మాస్ మార్కెట్ అయిన సీడెడ్ కలెక్షన్స్ గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదు గానీ, ఓపెనింగ్ డే మాత్రం పర్వాలేదనిపించే విధంగా ఉన్నాయి.

ఏపీలో సినిమాలపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల రీత్యా హిట్ సినిమాలైన “అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్, భీమ్లా నాయక్” నష్టాలు చవిచూడగా, ‘రాధే శ్యామ్’ ఫైనల్ గా ఎక్కడ తేలుతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. ఇక ‘రివ్యూ’లు కీలక పాత్ర పోషించే యుఎస్ లో ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలిపి 1 మిలియన్ మార్క్ ను దాటింది.

ఓవరాల్ గా తెలుగు నాట ఓపెనింగ్స్ సంతృప్తికరంగా ఉండగా, ఇతర భాషలలో మాత్రం “రాధే శ్యామ్” ఆశించిన ఫలితాలను అందిపుచ్చుకోవడంలో విఫలమైనట్లే కనపడుతోంది. దీనికి ప్రధాన కారణం హీరోగా ప్రభాస్ కున్న యాక్షన్ ఇమేజ్. ప్రభాస్ కటౌట్ కు తగిన కంటెంట్ తో వస్తే, రివ్యూలు సరిగా లేకపోయినా ‘సాహో’ మాదిరి కలెక్షన్స్ అయినా సాధించి ఉండేది.