Radhe-Shyam-Director-Radha-Krishnaభాషతో నిమిత్తం లేకుండా “రాధే శ్యామ్” సినీ విశ్లేషణలలో ఎక్కువ శాతం నెగటివ్ గానే వచ్చాయి. కధలోని లోపాలను, కధనంలో లోటుపాటులను ఎత్తిచూపుతూ సాగిన ఈ ‘రివ్యూ’లపై చిత్ర దర్శకుడు రాధాకృష్ణ గుర్రుగా ఉన్నారు. ‘రివ్యూ’లకు సమాధానం ‘రాధే శ్యామ్’ సినిమా కలెక్షన్స్ ను పోస్ట్ చేస్తూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మొదటి రోజు 79 కోట్లు గ్రాస్ అని, రెండు రోజులకు 119 కోట్లు గ్రాస్ అని పోస్టర్లు రిలీజ్ చేసిన రాధాకృష్ణ, నెగటివ్ రివ్యూలపైన తనదైన శైలిలో వివరణ ఇచ్చుకున్నారు. ఈ సినిమా మంచి ఏమోషనల్ కంటెంట్ తో కూడిన ప్రేమకధగా ముందు నుండే చెప్తున్నామని, ‘పప్పన్నం’ పెడతామని ముందే చెప్తే, ఇక్కడికి ‘బిర్యానీ’ అడిగితే ‘రాంగ్ హోటల్’కు రావడం వాళ్ళది తప్పని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.

అయితే ఈ సందర్భంగానే మరో మాట కూడా చెప్పుకొచ్చారు రాధా. ఈ కధకు ప్రభాస్ నే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే, “బాహుబలి” సినిమా కొన్ని లక్షల మంది చూసేసారు. దీంతో ప్రభాస్ ద్వారా తన కధను మరింత ఎక్కువ మందికి చేరువ చేయాలని ప్రభాస్ ను హీరోగా ఎంపిక చేసుకున్నట్లుగా ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

మరి రాధా లాజిక్ ప్రకారం చూసుకున్నా, ‘బాహుబలి’ని కేవలం ‘పప్పన్నం’ తినేవారో లేక ‘బిర్యానీ’ తినే వారో చూడలేదు. సినీ ప్రేక్షక లోకం మొత్తం నీరాజనాలు పలికితే అంత లక్షల మంది చూడగలిగారు. మరి ‘బాహుబలి’ అంత రీచ్ కోరుకుని ప్రభాస్ ను ఎంపిక చేసుకున్నప్పుడు ‘పప్పన్నం’ పెడతానని ముందే చెప్పానని వివరణ ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసం?

అయినా ‘పప్పన్నం – బిర్యానీ’ అంటూ ఈ ‘దద్దోజనం’ మాటలు ఎందుకు డైరెక్టర్ గారు? నిజంగా “రాధే శ్యామ్” హిట్ అయితే రివ్యూలు ఇచ్చే వారికేమి నష్టం జరగదు, అలాగని ఫట్ అయితే వారికేమి లాభం కూడా ఉండదు. రివ్యూలతో నిమిత్తం లేకుండా ‘అఖండ, పుష్ప’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద జయకేతనాన్ని ఎగురవేశాయి. అలాగే వాటి కంటే మెరుగైన రివ్యూలను దక్కించుకున్న ‘భీమ్లా నాయక్’ ఆ స్థాయి కలెక్షన్స్ ను అందుకోలేకపోయింది.

అంతిమంగా ఏతావాతా తేలుతోంది ఏమిటంటే… ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా ఉందా? లేదా? అని! రివ్యూలపై మరియు నెగటివ్ టాక్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతోన్న రాధాకృష్ణ, మరి సోమవారం నాటి సింగిల్ డే కలెక్షన్స్ ను ధైర్యంగా అందించగలరా? దానిని బాక్సాఫీస్ హిట్ క్రింద డిక్లేర్ చేయగలరా? విమర్శలను స్వీకరించి, భవిష్యత్తులో ఆ విమర్శలకు తావు లేకుండా సినిమా తీసి చూపించడం దర్శకుడిగా రాధాకృష్ణ ప్రతిభను ప్రశ్నించే అంశం.