Radhe Shyam Box Office Collectionsభారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీగా విడుదలైన ప్రభాస్ “రాధే శ్యామ్”కు తొలి షో నుండే డివైడ్ టాక్ లభించిన విషయం తెలిసిందే. తెలుగు మినహా మిగిలిన ఏ భాషలలో కూడా ఓపెనింగ్స్ లో ఏ మాత్రం ప్రభావం చూపించలేని ఈ సినిమా ఫలితం బాక్సాఫీస్ వద్ద తేలిపోయిందని ట్రేడ్ పండితులు స్పష్టం చేస్తున్నారు.

తెలుగులో మొదటి మూడు రోజులు మంచి ఓపెనింగ్స్ ను అందుకుని వీక్ డేస్ లోకి ప్రవేశించగా, సోమవారం నాటి కలెక్షన్స్ బాక్సాఫీస్ రిజల్ట్ ను తేల్చేసాయని లెక్కలు కడుతున్నారు. వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ కు పొంతన లేకుండా సోమవారం నాటి కలెక్షన్స్ ఉండడంతో, “రాధే శ్యామ్” తెలుగు నాట కూడా పరాజయం దిశగా సాగుతోందని అర్ధమవుతోంది.

సినిమా ఫస్టాఫ్ పట్ల ప్రేక్షకులంతా పాస్ మార్కులు వేస్తున్నారు గానీ, సెకండాఫ్ లో హీరో హీరోయిన్ల చావులకు లాజిక్ లేని కధనాన్ని లింక్ పెట్టి ప్రేక్షకులను కన్ఫ్యూషన్ లో పడేసిన వైనం సినిమా నెగటివ్ టాక్ కు ప్రధాన కారణం. కధనంలోని లోపాలను గమనించుకోని డైరెక్టర్ రాధాకృష్ణ, నెగటివ్ టాక్ పై మాత్రం పూర్తి అసహనంగా ఉన్నారు.

ఈ వారంలో ఏ పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో కాస్తైనా ‘రాధే శ్యామ్’ ఒడ్డున పడుతుందేమో చూడాలి. తొలి మూడు రోజులకే ‘రాధే శ్యామ్’ తేలిపోవడంతో, బాక్సాఫీస్ వద్ద ‘భీమ్లా నాయక్’ సందడి కాస్త హల్చల్ చేస్తోంది. దీంతో ప్రస్తుతం సినీ ప్రేక్షకుల చూపులన్నీ “ఆర్ఆర్ఆర్” వైపుకు మళ్ళాయి. ప్రమోషన్స్ కూడా ఊపందుకున్న నేపధ్యంలో మరో 10 రోజుల్లో బాక్సాఫీస్ కళకళలాడి పోతుందని అంచనా వేస్తున్నారు.