Radhe -Shyam-bookingsఇండియా వ్యాప్తంగా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ హీరోగా నటించిన “రాధే శ్యామ్” సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. యధావిధిగా తొలి టాక్ యుఎస్ ప్రీమియర్స్ నుండి వెలువడనుంది. యుఎస్ ప్రీమియర్ బుకింగ్స్ కూడా (500K డాలర్స్ పైనే) ఆశించిన స్థాయిలోనే ఉండగా, ఇటీవల ‘భీమ్లా నాయక్’ వసూలు చేసిన (615K డాలర్స్)ను ‘రాధే శ్యామ్’ దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యుఎస్ పరిస్థితి ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి విచిత్రంగా ఉంది. నైజం నాట మరోసారి ప్రభాస్ పేరిట ఆల్ టైం రికార్డులు తిరగరాసే విధంగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి. మొదటి రోజు నైజాంలో ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ నమోదయ్యే విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉండడంతో, యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

తెలంగాణాలో ఇలా ఉంటే, ఏపీలో ఇప్పటివరకు ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం విస్తుపోయే అంశంగా మారింది. విడుదలకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండగా, సినిమా టికెట్లను విక్రయించే యాప్ లలో ఇంకా “రాధే శ్యామ్” అందుబాటులోకి రాకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలపై కొత్త జీవో ఇచ్చిన దరిమిలా, అందుకు తగిన విధంగా ధరలను అప్ డేట్ చేసే పనిలో ఉన్నారో లేక 100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమా కాబట్టి, తొలి పది రోజుల కోసం ప్రత్యేక ధర అనుమతుల కోసం వేచిచూస్తున్నారో గానీ, ‘రాధే శ్యామ్’ టికెట్ల కోసం ఏపీ సినీ ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు.

ఆఫ్ లైన్ ప్రమోషన్స్ లో పొంతన లేకుండా ప్రవర్తించిన ప్రభాస్ – పూజాల జోడి, వెండితెరపై మాత్రం అద్భుతంగా కనిపించే విధంగా ట్రైలర్స్ గానీ, పాటలు గానీ ఉన్నాయి. ‘లవ్ అండ్ డెస్టినీ’తో ముడిపెట్టిన ఈ “రాధే శ్యామ్”ను తెలుగు దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించగా, భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ సంస్థ అద్భుతంగా నిర్మాణం గావించింది.