radha-trailer-talk- sharwanandసక్సెస్ ట్రాక్ లో ఉన్నపుడు ఏం చేసినా వర్కౌట్ అవుతుంటాయి… ప్రస్తుతం యువహీరో శర్వానంద్ కూడా అదే ట్రాక్ లో పయనిస్తున్నాడు. ఈ ఏడాది ‘శతమానం భవతి’ ద్వారా భారీ హిట్ కొట్టిన శర్వానంద్, మరో వారం రోజుల్లో “రాధ” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. దీంతో పబ్లిసిటీలో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్, వీక్షకుల ఆదరణను చూరగొంటోంది.

‘గబ్బర్ సింగ్’ పోలీస్ క్యారెక్టర్ మాదిరి కనపడుతున్న శర్వానంద్ పాత్ర, ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంలో సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ఈ ట్రైలర్ కు బ్యాక్ బోన్ గా నిలిచింది మాత్రం రాడాన్ అందించిన నేపధ్య సంగీతం. ఫుల్ జోష్ తో కూడిన సంగీతానికి శర్వానంద్ హావభావాలు, డైలాగ్స్ తోడు కావడంతో ట్రైలర్ అంతా ఎంటర్టైన్మెంట్ గా సాగింది. అయితే రొటీన్ కమర్షియల్ సినిమా మాదిరి కనిపించడం ప్రధాన మైనస్.

ముఖ్యంగా టాలీవుడ్ లో సూపర్ హిట్లుగా నిలిచిన ‘గబ్బర్ సింగ్, రేసుగుర్రం’ సినిమాల సన్నివేశాలు గుర్తుకు రావడం ఫ్రెష్ నెస్ ను కలిగించలేకపోయింది. అయితే వీటన్నింటిని శర్వా తనదైన నటనతో అధిగమిస్తాడో లేదో అన్న విషయం వచ్చే వారంలో తేలనుంది. చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వాకు జతగా లావణ్య త్రిపాఠి, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విడుదలైన ఈ సినిమా ఆడియో శ్రోతలను ఆకట్టుకోవడం ప్లస్ పాయింట్.