Radha Mohan Singh chandrababu naiduఆంధ్ర ప్రదేశ్లో జరుగుతున్న భూసేకరణను ఒక పక్క అంత పోగుడుతుంటే, కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు బ్రేక్‌ వేసింది. అభివృద్ధి పనులకు పంటభూములను సేకరించడంపై కేంద్ర వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐతే ఇదే తరహాలో రూపొందించిన గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ బిల్లులకు ఆమోదం తెలిపింది కేంద్రం.

గత ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూసేకరణ బిల్లును ఆమోదించి కేంద్రం అనుమతి కోసం పంపింది. అదే సమయంలో గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ బిల్లులూ కేంద్రం ఆమోదానికి వచ్చి వెంటనే ఆమోదం పొందాయి. ఈ మూడు బిల్లులూ ఒక్క క్లాజులో కూడా మార్పు లేకుండా ఒకే మాదిరి ఉన్నాయి.

గుజరాత్‌, తెలంగాణ బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపింది. ఏపీ బిల్లులో పంట భూముల సేకరణకు సంబంధించిన సెక్షన్‌ 10(ఏ)కు కేంద్ర వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐతే ఇదే క్లాజ్‌ గుజరాత్‌, తెలంగాణ బిల్లులలోనూ ఉంది. కేవలం ఏపీ బిల్లుపై మాత్రం అభ్యంతరాలు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీ భూసేకరణ బిల్లును గ్రామీణాభివృద్ధి శాఖ క్లియర్ చేసింది. వ్యవసాయశాఖ మాత్రం రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం పంట భూములను సేకరించడం కేంద్ర భూసేకరణ విధానానికి వ్యతిరేకమంటూ అడ్డుపుల్ల వేసింది. ఇదే క్లాజ్‌ గుజరాత్‌, తెలంగాణ బిల్లులలోనూ ఉన్న దానికి ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు.

ఐతే దీనివల్ల, ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లదని, తమ ప్రభుత్వం చేపడుతున్న చిన్న, భారీ సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా 12 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రానుందని ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ వివరణను తోసిపుచ్చి కొత్తగా సాగులోకి రానున్న 12 లక్షల హెక్టార్ల భూమి ఎక్కడుందో వివరాలు ఇవ్వాలంటూ ఈనెల 3న కేంద్ర వ్యవసాయశాఖ మరో అడ్డుపుల్ల వేసింది. చూడబోతే రాష్ట్రానికి ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక వేధింపు మంజూరు చేసినట్టు ఉంది కేంద్రం.