Raai Laxmi in Lakshmis-Veeragrandhamప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్‌ లు హాట్ టాపిక్ అయ్యాయి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో మూడు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మరోటి రెడీ అవుతోంది. దీనికి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని పేరు ఖరారు చేశారు.

దీనికి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ వస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగిసి రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ఇటీవల ఎన్టీఆర్ ఘాట్‌లో తొలి షాట్‌ కోసం ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సినిమాకు తన అనుమతి లేదని, సినిమా తీస్తే తీవ్ర పరిణామాలుంటాయని లక్ష్మీపార్వతి కూడా కేతిరెడ్డిని హెచ్చరించారు.

ఈ సినిమాపై వివాదం కొనసాగుతుండగానే ఈ చిత్రంలో లక్ష్మీపార్వతిగా ఎవరు నటించోతున్నారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తొలుత వాణీవిశ్వనాథ్‌ను అనుకున్నట్టు వార్తలు వచ్చాయి. తనను సంప్రదిస్తే నటించేందుకు రెడీ అంటూ ఆమె కూడా బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరూ తెలిసిపోయిందంటూ టాలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి.

‘కాటమరాయుడు, ఖైదీ నంబరు 150’ సినిమాల్లో స్పెషల్ సాంగుల్లో చిందేసిన రాయ్‌లక్ష్మిని లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎంపిక చేసినట్టు లేటెస్ట్ టాక్. అదే కనుక నిజమైతే ఈ సినిమా మరింత సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. అయితే ఈ విషయంలో దర్శకుడు కేతిరెడ్డి నుంచి ఎటువంటి సమాచారం లేదు. కాగా రాయ్‌లక్ష్మి నటించిన ‘జూలీ 2’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.