తాను నిర్మించిన “మగధీర” సినిమా రీమేక్ హక్కులు తీసుకోకుండా, ఈ చిత్ర కధతో “రాబ్తా” అనే సినిమాను నిర్మించి, జూన్ 9న విడుదల చేస్తున్నారని, కనుక ఈ సినిమా విడుదల ఆపాలని అల్లు అరవింద్ దాఖలు చేసిన పిటిషన్ జూన్ 1వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన “రాబ్తా” చిత్ర యూనిట్ అల్లు అరవింద్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ… ఓ ప్రకటన విడుదల చేసారు.

“కేవలం 2 నిమిషాల 14 సెకన్లు ఉన్న ట్రైలర్ ను చూసి తమ సినిమా కాపీ అని ఎలా నిర్ణయిస్తారని” చిత్ర నిర్మాతలు దినేష్ విజయన్, భూషణ్ కుమార్ లు అల్లు అరవింద్ ను ప్రశ్నించారు. ఇది తమ సృజనాత్మకతను అవమానించడమేనని, పలు సినిమాలలోని సన్నివేశాల స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించాము తప్ప, కాపీ కొట్టలేదని, ‘మగధీర’ టీం చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని తెలిపారు.

ఓ కాలరహిత ప్రేమకధగా తమ ‘రాబ్తా’ను తీశామని, వినూత్న ఆలోచనలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని, క్రియేటివిటీపై కాపీ రైట్స్ ఎవరికీ ఉండవని కాస్త వ్యంగ్యంగానే బదులిచ్చారు. చూడబోతుంటే అల్లు అరవింద్ కు ‘నామం’ పెట్టే వ్యాఖ్యలనే ‘రాబ్తా’ నిర్మాతలు చేస్తున్నారు. అయితే జూన్ 1వ తేదీన జరగనున్న విచారణతో “రాబ్తా” విడుదలపై నెలకొన్న ఉత్కంఠ వీడే అవకాశం కనపడుతోంది.