PV Sindhu, PV Sindhu Apparel Controversy, PV Sindhu Rio Olympics Apparel Controversy, PV Sindhu Rio Olympics Dress Controversy, PV Sindhu Rio Olympics 2016 Apparel Controversyఇటీవలే ముగిసిన రియో ఒలింపిక్స్ లో కాకలు తీరిన క్రీడాకారులంతా పెట్టే బేడా సర్దుతున్న తరుణంలో భారత సత్తా చాటుతూ తెలుగు తేజం పీవీ సింధు బ్యాడ్మింటన్ లో రజత పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక పతకం సాధించలేకపోయినా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ దేశ ప్రజల హృదయాలను గెలుచుకుంది. అయితే వీరిద్దరితో పాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు.

స్పాన్సర్లతో కుదిరిన ఒప్పందాలను ధిక్కరిస్తూ వారు వ్యవహరించిన తీరుపై వివాదం రాజుకుంది. రియో ఒలింపిక్స్ కు సంబంధించి భారత ఒలింపిక్ సంఘంతో ‘లీ నింగ్’ అనే సంస్థ ఒప్పందం చేసుకుంది. 3 కోట్లను భారత ఒలింపిక్ సంఘానికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు సంస్థ… రియోలో భారత క్రీడాకారులంతా తమ బ్రాండ్ దుస్తులనే వాడాలని సాధారణంగానే ఓ షరతు పెట్టింది. అందుకు ఇండియన్ ఒలంపిక్ సంఘం కూడా అంగీకరించింది.

అయితే పీవీ సింధు, దీపా కర్మాకర్, యోగేశ్వర్ దత్, కిడాంబి శ్రీకాంత్ లు పలు మ్యాచ్ ల్లో ‘లీ నింగ్’ బ్రాండ్ దుస్తులు కాకుండా ఇతర కంపెనీల దుస్తులు వాడడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ‘లీ నింగ్’ సంస్థ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్ సంఘానికి లేఖ కూడా రాసింది. దీంతో వారిపై ఏమైనా చర్యలు ఉంటాయా? లేక జరిమానా ఉంటుందా? అన్న విషయం తేలాల్సి ఉంది.