PV Sindhu at Kaun Banega Crorepati‘వైఎస్ఆర్’ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు అందరూ టక్కున ఏడుగురి సంధింటి రాజశేఖర్ రెడ్డి అని జవాబు ఇవ్వడం సహజం. రాజకీయ వర్గాలకు సుపరిచితం అయిన ఈ పేరుతోనే జగన్ తన పార్టీని స్థాపించారనేది కామన్ మాన్ లో ఉన్న అభిప్రాయం. కానీ జగన్ స్థాపించింది తన తండ్రి పేరుతో కాదు, అన్న విషయం సగటు ప్రజానికానికే కాదు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పివి సింధు వంటి సెలబ్రిటీలకు సైతం తెలియదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును… అమితాబ్ నిర్వహించే “కౌన్ బనేగా కరోడ్ పతి” కార్యక్రమంలో ప్రత్యేకంగా వెళ్ళిన సింధు, తొలి 12 ప్రశ్నలను విజయవంతంగా పూర్తి చేసుకుని 12.50 లక్షలు గెలుచుకున్న తర్వాత, 13వ ప్రశ్న సందర్భంలో తడబాటుకు గురైంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన ‘వైఎస్ఆర్’ కాంగ్రెస్ పార్టీలో ‘వైఎస్ఆర్’ అంటే ఏంటి అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఎ) యువ సత్య రాజ్యం, బి) ఎడుగూరి సంధింటి రాజశేఖర, సి) యూత్ షల్ రూల్, డి) యువజన శ్రామిక రైతు… అంటూ నాలుగు ఆప్షన్స్ ను ఇచ్చారు.

దీనిపై ఆలోచనలు చేసిన పివి సింధు, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోనే పార్టీ స్థాపించి ఉంటారని భావించి, తొలుత ‘బి’ ఆప్షన్ ను ఎంచుకుంది. ఈ సందర్భంలో బాగా ఆలోచించి చెప్పాలని బిగ్ బీ చేసిన సూచనతో, తన చెల్లెలు సాయం తీసుకున్న సింధు, తర్వాత ఆప్షన్ డి అయిన ‘యువజన శ్రామిక రైతు’ను ఎంచుకుని 25 లక్షలు గెలుచుకుని ఆ పై హాట్ సీట్ వదిలింది. జగన్ పార్టీకి పెట్టిన పేరు ఇంత గందరగోళానికి గురి చేస్తుందా? అన్న విషయం ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం ద్వారా తెలిసివచ్చినట్లయ్యింది.