Putta-Mahesh-Kumarపలాడు జిల్లా నరసారావుపేట లోక్‌సభ స్థానానికి టిడిపిలో అప్పుడే పోటీ మొదలైంది. గత ఎన్నికలలో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావుకి ఆ సీటు కేటాయించినప్పటికీ ఓడిపోయారు. ఆ తర్వాత వయోభారం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ అప్పుడు ఆయన బరిలో దిగకపోయుంటే గుంటూరుకి చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థల అధినేతని బరిలో దింపాలని టిడిపి భావించింది. ఈసారి రాయపాటి బరిలో దిగకపోవచ్చు కనుక ఆయన టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

కానీ ఆ సీటును తనకు ఇవ్వాలని పుట్టా మహేష్ యాదవ్ ఇటీవల టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కలిసి అడిగారు. పుట్టా మహేష్ యాదవ్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ అధ్యక్షుడుగా చేశారు. మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడి స్వయాన్న అల్లుడు కూడా. కనుక పుట్టా మహేష్ యాదవ్‌కు తప్పకుండా ఆయన మద్దతు ఉంటుంది.

నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలోనే టిడిపి కొత్త అభ్యర్ధిని నిలబెట్టాలని భావించింది. కానీ కుదరలేదు. కానీ టిడిపి మనుగడకు, భవిష్యత్‌కు ఎంతో కీలకమైన వచ్చే ఎన్నికలలో ఇటువంటి ప్రయోగాలు చేసేందుకు సాహసిస్తుందా? కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్‌కు నరసన్నపేట ఇచ్చేందుకు స్థానిక టిడిపి నేతలు ఒప్పుకొంటారా?ఎన్నికలలోపుగా ఇంకా ఎన్ని పేర్లు వినిపిస్తాయో తెలీదు. కనుక టిడిపిలో నరసారావుపేట లోక్‌సభ టికెట్ ఎవరికి లభిస్తుందో తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.