పుష్ప - వైసీపీ - బంగార్రాజు!డిసెంబర్ 24వ తేదీ : కాకినాడ వేదికగా “పుష్ప” సక్సెస్ సంబరాలు చేసుకోవడానికి చిత్ర యూనిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర వినతిపత్రం పెట్టగా, కరోనా వ్యాప్తి కారణాలతో ఈ ఈవెంట్ కు అనుమతి ఇవ్వలేదు. దీంతో కాకినాడ ఈవెంట్ ను చిత్ర యూనిట్ అప్పటికప్పుడు రద్దు చేసింది. అప్పట్లో రోజుకు కరోనా కేసులు 500 లోపే ఏపీలో నమోదవుతున్నాయి.

జనవరి 18వ తేదీ : రాజమండ్రి వేదికగా “బంగార్రాజు” సక్సెస్ సెలబ్రేషన్స్ కు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులే దిగి వస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో పాటు కురసాల కన్నబాబు, జక్కంపూడి రాజా మరియు మార్గాని భరత్ లు హాజరవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం సోమవారం నాడు ఒక్కరోజే నమోదైన కరోనా కేసుల సంఖ్య 6 వేలు దాటింది.

ఏదైనా మాకు ఒకటే… అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఏ హీరో సినిమా అయినా… అంటూ కబుర్లు చెప్పిన వైసీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సోషల్ మీడియా జనులు నిలదిస్తున్నారు. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ చేయనిది ఏమిటి? ‘బంగార్రాజు’ హీరో నాగార్జున చేసింది ఏమిటి? అంటే… టికెట్ ధరలకు నాగ్ మద్దతు తెలపగా, బన్నీ మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు.

రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా నమోదవుతున్న నేపధ్యంలో… భారీ స్థాయిలో పబ్లిక్ ఈవెంట్ కు అనుమతులు ఇవ్వడమే కాకుండా, దానికి స్వయంగా ఏపీ రాజకీయ నేతలంతా ‘క్యూ’ కట్టడం విస్మయానికి గురిచేస్తోంది. బహుశా కరోనాని ఇలాగే కట్టడి చేయాలని చెప్తారేమో? ఆ మాత్రం దానికి కరోనా ఆంక్షలను అమలు చేయడం ఎందులకు?