'పుష్ప' సీన్ రిపీట్ చేసిన ఏపీ 'మంత్రి'సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన “పుష్ప” సినిమా సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. మంత్రి క్యారెక్టర్ వేసిన రావు రమేష్ విలన్ సునీల్ కు ఫోన్ చేసి ‘మీరు పట్టుకున్న వ్యక్తి మనకి కావాల్సిన వాడే, ఈ సారికి వాడిని విడిచి పెట్టేయండి’ అంటూ విన్నవించుకోగా, దానికి సునీల్, ‘అయ్యో ఒక్క పది నిముషాల ముందు చేయాల్సింది, చంపేసాను’ అంటాడు.

అలాగే ఇదే సీన్ ను తదుపరి హీరో అల్లు అర్జున్ కూడా రిపీట్ చేస్తాడు. విలన్ సునీల్ హీరోకు ఫోన్ చేసి తన బావమరిదిని వదిలేయాలని కోరగా, అయ్యో ఒక్క అయిదు నిముషాల ముందు చేయాల్సింది, చంపేసాను అంటూ బదులిస్తాడు. సిల్వర్ స్క్రీన్ పై ఈ రెండు సీన్లు ఎంతగా పండాయో పక్కన పెడితే, ఇలాంటి సన్నివేశమే రియల్ గా జరిగిందేమో అన్న భావనను వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు వ్యక్తపరిచారు.

సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేసిన వైనం బహిరంగమే. అయితే మీడియా ముందుకు వచ్చిన బాలినేని, తన అనుచరులను పంపించి అడ్డుకున్నాను తప్ప, తాను దాడి చేయమని చెప్పలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. దీనినే ఆర్ఆర్ఆర్ వివరిస్తూ… సుభాని అన్న వ్యక్తి సుబ్బారావును కొట్టడానికి ముందే కాల్ వెళ్లిందో లేదో కొట్టేసిన తర్వాత వెళ్లిందో గానీ ఇది ‘పుష్ప’ సినిమాలో సీన్ మాదిరి ఉందని ఉదహరించారు.

ఎందుకంటే సుబ్బారావు దెబ్బలు తిన్నదంతా వీడియోలో కనపడుతోంది, అలాగే మీడియా ముందుకు వచ్చి బాలినేని అలా అబద్ధాలు చెప్తాడని తాను అనుకోవడం లేదని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ అభిప్రాయ పడ్డారు. ప్రతి రోజు నిర్వహించే ‘రచ్చబండ’ కార్యక్రమంలో భాగంగా రాజు గారు ఈ రోజు తన భావాలను ఈ విధంగా పంచుకున్నారు. మొత్తానికి రాజు గారికి సినీ పరిజ్ఞానం పుష్కలంగా ఉందని మరోసారి అర్ధమవుతోంది.

ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో కూడా పలు సినిమాల పేర్లను ప్రస్తావించారు. ప్రజలందరూ బాధపడుతుంటే ‘స్పైడర్’ సినిమాలో విలన్ మాదిరి ఏపీ సీఎం ఉన్నారని, ‘మాయాబజార్’ సినిమాలో రంగారావు గారు పలికిన ‘ఆర్తనాధములు శ్రవణానందకరములుగా ఉన్నవి’ వంటి డైలాగ్స్ తో ప్రస్తుత స్థితులను పోల్చి చెప్పిన వైనం ఆర్ఆర్ఆర్ ను వీక్షకులకు మరింత చేరువ చేస్తోంది.