Pushpa Advance Bookings” పుష్ప” కోసం అల్లు అర్జున్ ఏ స్థాయిలో కష్టపడ్డారో ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేసారు. పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం బన్నీ చూపిన కసిని ప్రదర్శించడం ఇపుడు ఫ్యాన్స్ వంతవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట నిముషాల వ్యవధిలో ‘హౌస్ ఫుల్’ బోర్డ్స్ పడిపోవడం టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇప్పటికే యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలనంగా నిలువగా, తెలంగాణాలో కూడా తొలిరోజు రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల రీత్యా పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో టికెట్లు ఇంకా ఓపెన్ కాలేదు. అయితే ఓపెన్ అయిన కొన్ని మల్టీప్లెక్స్ ల టికెట్లు మాత్రం కొద్దీ సమయంలోనే ఊడ్చేశారు బన్నీ ఫ్యాన్స్.

బహుశా ఏపీ సర్కార్ చేస్తోన్న హడావుడికి తమ టికెట్లతోనే బదులివ్వాలనుకున్నారో ఏమో గానీ, ఫస్ట్ డే బుకింగ్స్ దుమ్ము దులిపేస్తున్నారు. ఈ ఒరవడి చూస్తుంటే, అల్లు అర్జున్ సత్తా ఏమిటో “పుష్ప” ద్వారా చాటేందుకు అభిమానులు కంకణం కట్టుకున్నట్లుగా కనపడుతోంది. ఇది నాణానికి ఒక వైపు కాగా, “పుష్ప”కు ఎలాంటి టాక్ వస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనికి అనేక కారణాలున్నాయి.

పాన్ ఇండియా స్థాయిలో అయిదు భాషల్లో “పుష్ప” ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని విడుదలకు 24 గంటల ముందు మైత్రీ మూవీ మేకర్స్ ధృవీకరించారంటే, నిర్మాతల ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఇంతవరకు దర్శకుడు సుకుమార్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా గురించి ‘ఒక్క ముక్క’ కూడా చెప్పలేదు. చివరి నిముషం వరకు ‘పుష్ప’ను మరింతగా చెక్కే పనిలో ఉన్నారంటే ప్రేక్షకులకు ఎలాంటి సంకేతాలను పంపుతున్నారు?

ఏదొక ఒక చిన్న సినిమా అయితే ఆర్ధిక ఇబ్బందుల వలన ఆలస్యం అయ్యిందని ప్రేక్షకులు అర్ధం చేసుకుంటారు. కానీ దేశవ్యాప్తంగా రిలీజ్ కు ప్లాన్ చేసుకుని ఆఖరి నిముషం వరకు సినిమాను తీర్చిదిద్దడం అంటే, బాధ్యతారాహిత్యం కాదా? సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, తెరపై తాను ఏం చెప్పబోతున్నానో ప్రేక్షకులకు తెలియజేయకుండా, డైరెక్ట్ గా వెండితెరపై చూసుకోమని చెప్పడం ఓ అగ్ర దర్శకుడిగా సుకుమార్ కు తగునా?

చిత్ర యూనిట్ గందరగోళ ప్రమోషన్స్… ఏపీలో జగన్ తీసుకుంటున్న చర్యలు… యుఎస్ లో ‘స్పైడర్ మ్యాన్’ రూపంలో ఆశించిన స్క్రీన్స్ లభించకపోవడం… ఇన్ని ఒడిదుడుకుల నడుమ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “పుష్ప” సినిమాకు నిజమైన ‘బ్లాక్ బస్టర్’ టాక్ రావడం మామూలు విషయం కాదు. అయినప్పటికీ బన్నీ అభిమానులు మాత్రం ‘తగ్గేదేలే’ అంటూ అడ్వాన్స్ బుకింగ్స్ లో సంచలనం సృష్టిస్తున్నారు.

‘అఖండ’ సక్సెస్ తో టాలీవుడ్ కు వచ్చిన ఊపు “పుష్ప” కూడా కొనసాగిస్తే, మరో వారంలో విడుదల కాబోయే నాని “శ్యామ్ సింగరాయ్”కు మరియు సంక్రాంతి సినిమాలకు కూడా కొండంత ధైర్యం ఇచ్చినట్లవుతుంది. అన్ని అవాంతరాలను దాటుకుని ‘పుష్ప రాజ్’గా బన్నీ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని ఆశిద్దాం.