Puri Jagannadh drugs case investigationపది గంటల సుదీర్ఘమైన విచారణ అనంతరం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ సిట్ కార్యాలయం నుండి ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయంత్రం అయిదు గంటలకు ముగించాల్సిన విచారణను కొనసాగించడంతో ఒకానొక సమయంలో పూరీ అరెస్ట్ ఉంటుందేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో పూరీ జగన్నాధ్ సతీమణి మరియు ఆయన మేనమామ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ అలాంటి ట్విస్ట్ లకు తావు లేకుండా 10 గంటల విచారణ అనంతరం వదిలిపెట్టారు.

“విచారణలో తమకు పూర్తిగా సహకరించారని, అలాగే వాలెంటరీగా బ్లడ్ శాంపిల్ ఇచ్చారని, దానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత తదుపరి ప్రాసెస్ కొనసాగుతుందని, ఎంక్వయిరీలో పూరీ నుండి అదనపు సమాచారం లభించిందని, అలాగే ఈ కేసుకు సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చారని” విచారణ గురించి చెప్పుకొచ్చారు సిట్ అధికారి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. దీంతో పాటు రెండవ రోజు ఛార్మి విచారణ ఉంటుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్తూ… ఫోటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు విచారణకు హాజరవుతారని తెలిపారు.

తొలి రోజు అంతా బాగానే జరిగింది గానీ, ఈ కేసుకు సంబంధించి పూరీ కొన్ని ‘క్లూస్’ ఇచ్చారని సిట్ అధికారి చెప్పడం అనేది కాస్త తేడా కొట్టే అంశంగా మారింది. తాను డ్రగ్స్ వాడనని తెగేసి చెప్పిన పూరీ జగన్నాధ్ కు, నిజంగానే ఈ కేసుతో సంబంధం లేని పక్షంలో, ఈ ‘క్లూస్’ ఎక్కడ నుండి వచ్చాయి? అసలింతకీ పూరీ ఇచ్చిన ‘క్లూస్’ ఏంటి? అన్నవి ఆసక్తికరంగా మారాయి. ఒకవేళ నిజంగానే పూరీ అదనపు సమాచారం అందిస్తే… ఈ డ్రగ్స్ రాకెట్ గురించి ఎంతోకొంత సమాచారం తన దగ్గర ఉందని పూరీ అంగీకరించినట్లే అవుతోంది కదా!

అంతేకాదు, ఆగష్టు 3వ తేదీ తర్వాత మళ్ళీ మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశాన్ని పూరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా కూడా పరోక్షంగా తెలియజేసారు. ఇప్పటివరకు మీడియా ముందుకు రాకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ వీడియోతో అభిమానులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరూ తనపై రాసిన కధనాలకు తీవ్ర విచారం వ్యక్తం చేసారు పూరీ. ఏవో కట్టుకధలు అల్లి, తనపై కధనాలు ప్రసారం చేసారని ఆరోపించారు.

పూరీ ఇచ్చిన బ్లడ్ శాంపిల్ కు సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత మరోసారి సిట్ అధికారులు పూరీని విచారణకు పిలవ్వొచ్చని తెలుస్తోంది. మరో వైపు డ్రగ్స్ ను తమ కొరియర్లలో క్యారీ చేసిన డీహెచ్ఎల్, బ్లూ డాట్, ఫెడెక్స్ వంటి మూడు కొరియర్ కంపెనీలకు కూడా నోటీసులు ఇచ్చామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఆయా కొరియర్ల ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. మొత్తమ్మీద పూరీ విచారణ పేలవంగా మాత్రం సాగలేదని స్పష్టమవుతోంది.