Puri-Jagannadh-Charmme-Kaur-లైగర్‌ కొట్టిన దెబ్బకి దాని నిర్మాతలు పూరీ జగన్నాథ్, ఛార్మీకౌర్ నేటికీ తేరుకోలేకపోతున్నారు. ఈ కష్టాలు, నష్టాలు సరిపోవన్నట్లు వారిద్దరికీ కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈడీ అధికారులు వారిద్దరినీ నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు లైగర్‌ సినిమా పెట్టుబడుల గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా… మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌కి ఇచ్చిన పారితోషికం, సినిమాకి సంబందించి ఆర్ధిక లావాదేవీల గురించి వారిని ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. లైగర్‌ దెబ్బతో కోలుకోలేకపోతున్న వారిరువురికీ ఇదో కొత్త సమస్యే అని చెప్పవచ్చు.

ఈ కొత్త కష్టాల వెనుక ఓ రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణ సిఎం కేసీఆర్‌కి కేంద్రానికి మద్య కోల్డ్ వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. కనుక కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోకి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎటువంటి సంబంధమూ లేదని ఆయన కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారు.

ఈడీ అధికారులు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఇంకా పలువురుని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదికాక క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారాలపై కూడా పలువురిని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులిద్దరినీ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాధ రెడ్డిని, మాజీ ఎంపీ బుట్టా రేణుకా సోదరుడు యుగంధర్‌ని ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇక లైగర్‌ విషయానికి వస్తే ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండటంతో దీనిలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు అప్పుడే ఊహాగానాలు వినిపించాయి. వారిలో కల్వకుంట్ల కవిత కూడా ఒకరని ఊహాగానాలు వినిపించాయి. కనుక లైగర్‌ సినిమా పెట్టుబడుల తీగ లాగితే టిఆర్ఎస్‌ డొంక కదులుతుందనే ఆలోచన కూడా కేంద్రానికి ఉండి ఉండవచ్చు.

ఒకవేళ లైగర్‌లో టిఆర్ఎస్‌ నేతల పెట్టుబడులు ఉన్నట్లయితే, దాంతో వారి చుట్టూ ఉచ్చు బిగించాలని కేంద్రం భావిస్తోందేమో? రాజకీయనాయకులే స్వయంగా సినిమాలు తీయడం లేదా సినిమాలలో పెట్టుబడులు పెట్టడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ లైగర్‌ సినిమాలో కల్వకుంట్ల కవిత లేదా టిఆర్ఎస్‌ నేతలు మరెవరైనా పెట్టుబడులు పెట్టారా లేదా?పెడితే వాటికి పక్కా లెక్కలు చూపారా లేదా?అనేదే బహుశః ఈడీకి ముఖ్యమని భావించవచ్చు.

తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలాయనట్లు కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడుతుంటే అదొచ్చి పూరీ, ఛార్మీల పీకకు చుట్టుకోవడం ఏమిటి?అని అనిపించకమానదు. ఒకవేళ లైగర్‌తో టిఆర్ఎస్‌ నేతలకు సంబందం లేకపోయినా వారిద్దరికీ ఈడీ తలనొప్పులు తప్పకపోవచ్చు.