purandeswari vishukumar rajuగత కొంత కాలంగా బీజేపీ మహిళా మోర్చా ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతుంది. పురంధేశ్వరి వైకాపా వైపు, విష్ణు కుమార్ రాజు టీడీపీ వైపు చూస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనితో పురంధేశ్వరిని బుజ్జగించేందుకు ఆమెను పార్టీ మేనిఫెస్టో కమిటీ సారధిని చేశారు. దీనితో ఆమె కాస్త మెత్తబడినట్టుగానే కనిపిస్తుంది. ఈ రోజు ఆమె మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుని తిట్టేసి,మోడీని పొగిడేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆమె కొనియాడారు. సోమవారం విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలోని ప్రతి పథకంలోనూ అవినీతి పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. ఇప్పుడు ఏపీ ప్రజలు నీతివంతమైన పాలన ఆశిస్తున్నారని పురందేశ్వరి అన్నారు. దీనితో ఆమె పార్టీని వీడటం లేదని పార్టీ నేతలు, అభిమానులు నిశ్చయించుకున్నారు.

మరోవైపు పార్టీ మారడం ఖాయం అని చెప్పిన విష్ణు కుమార్ రాజుకు టీడీపీతో చెడినట్టు ఉంది. ఏపీలో ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. పురంధేశ్వరితో పాటు ఆయన కూడా విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశమునకు హాజరు అయ్యారు. ఇసుక ద్వారా టీడీపీ నేతలు రెండు వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు విచ్చలవిడిగా భూములు ఆక్రమిస్తున్నారని, దోపిడీని సీఎం చంద్రబాబు అరికట్టలేకపోయారని ఆయన ఆరోపించారు. మరో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇప్పటికే పార్టీ వీడటంతో పురంధేశ్వరి, విష్ణు కుమార్ రాజు దీనితో పార్టీని వీడరని పార్టీ ఊపిరి పీల్చుకుంది.