Pune Vs Gujarat - Ben stokes Qualifiers IPL 10ఇండియన్ ప్రీమియర్ లీగ్ 10 సీజన్ నుండి తప్పుకున్న రెండో జట్టు గుజరాత్ లయన్స్ జట్టు నిలిచింది. ఇప్పటికే కోహ్లి సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు టీం టోర్నీ నుండి తప్పుకోగా, తాజాగా రైనా నేతృత్వంలోని గుజరాత్ కూడా అదే బాటలో పయనించింది. చావో రేవో అని తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ జట్టు కేవలం 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి అయిదు ఓవర్లలో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి, గట్టి పోటీనిచ్చే స్కోర్ ను సాధించ లేకపోయింది.

అయితే పూణే బ్యాట్స్ మెన్లను తిప్పలు పెడుతూ 10 పరుగులకే మూడు కీలక వికెట్లు సొంతం చేసుకోవడంతో, మ్యాచ్ పై ఆశలు రేగాయి. కానీ, రైనాకు బెన్ స్టోక్స్ రూపంలో భారీ ‘స్ట్రోక్’ తగిలింది. క్రీజులోకి ఎంటరైంది మొదలు భారీ షాట్లతో విరుచుకుపడిన స్టోక్స్, జట్టును లక్ష్య చేధన వైపుకు తిప్పాడు. మరో ఎండ్ లో వికెట్ పడకుండా ధోని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివరి అయిదు ఓవర్లలో విజయానికి 60 పరుగులు చేయాల్సి ఉన్న తరుణంలో స్టోక్స్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.

భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఐపీఎల్ లో తన తొలి సెంచరీని నమోదు చేసాడు. 63 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయమైన 103 పరుగులతో పూణేకు అపూర్వ విజయాన్ని అందించి, ప్లే ఆఫ్స్ కు మరింత దగ్గర చేసాడు. దీంతో ఆడిన 10 మ్యాచ్ లలో 6 విజయాలను సొంతం చేసుకుని 12 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో బెన్ స్టోక్స్ ను భారీ మొత్తంలో సొంతం చేసుకున్న పూణే జట్టుకు, కీలక విజయాన్ని అందించడంలో స్టోక్స్ ప్రధాన పాత్ర పోషించాడు.