Puja kumar - PSV Garuda Herione Latestయూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన “విశ్వరూపం” సినిమాలో తళుక్కుమన్న పూజా కుమార్ సినీ ప్రేక్షకులను… ముఖ్యంగా యువ హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత కమల్ తెరకెక్కించిన “ఉత్తమ విలన్”లో నటించింది గానీ, ఈ సినిమా ద్వారా ప్రత్యేకంగా పూజకు వచ్చిన గుర్తింపేమీ లేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ భారీ అవకాశాలు తలుపు తట్టలేదు గానీ, తాజాగా రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న “పీఎస్వీ గరుడ” సినిమాలో నటిస్తోంది.

దాదాపుగా 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా స్టిల్స్ ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఆ ఫోటోలలో పూజాకుమార్ లుక్ ను మాత్రం చిత్ర యూనిట్ విడుదల చేయలేదు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా పూజతో కూడిన పోస్టర్స్ ను విడుదల చేసారు. ‘స్వాతి’ అనే పాత్రలో పూజ నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అయితే ‘విశ్వరూపం’లో చూసిన పూజకు, ప్రస్తుతం ‘గరుడ’లో చూస్తున్న పూజకు చాలా వ్యత్యాసం ఉండడంతో సినీ ప్రేక్షకులు అవాక్కయ్యారు.

లేలేతగా కమల్ కనిపించిన అదే పూజకుమార్ యేనా? అనిపించేలా ముఖకవళికల్లో భారీ మార్పులు వచ్చాయి. అయినప్పటికీ సహజ అందగత్తే కావడం, దానికి తోడు చీరకట్టులో కనిపించడంతో… పూజ లుక్ ఏమీ తీసేయదగ్గ విధంగా లేదు. ఈ సినిమాలో రాజశేఖర్ కు భార్యగా, ఆరు సంవత్సరాల బాబుకు తల్లిగా హోమ్లీ క్యారెక్టర్ లో కనువిందు చేయనుంది. పూజ నటించే డైరెక్ట్ తెలుగు సినిమా ఇదే కావడంతో, దీంతో విజయం వరిస్తే… టాలీవుడ్ లో చక్రం తిప్పే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి మరి!