Public Survey on Rs 500 Rs 1000 Notes Banప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయంపై అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓ పక్కన ప్రతిపక్షాలు… మరో పక్కన మీడియా వర్గాలు… ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతున్న తరుణంలో… అసలు ప్రజానీకం ఎలా స్పందిస్తున్నారు? ఇదే అంశంపై ప్రముఖ అంతర్జాతీయ పోలింగ్ ఏజెన్సీ ‘సీ-ఓటర్’ దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ నియోజక వర్గాల్లో ఓ సర్వే నిర్వహించింది.

మోడీ ప్రకటించిన నిర్ణయాన్ని విభేదిస్తున్న ప్రతిపక్షాలు, మీడియా వర్గాలు సిగ్గుతో తలదించుకునేలా ఈ సర్వేలో ప్రజలు సమాధానం ఇవ్వడం విశేషం. “నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే, అయినా భరిస్తాం, బ్లాక్ మనీపై మోడీ చేసిన ప్రకటనకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని” 80-86 శాతం ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేసి, మోడీ నిర్ణయానికి అనుకూలంగా ఓటేశారు.

గ్రామీణ‌ ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివసిస్తున్న 86 శాతం మంది నోట్ల ర‌ద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్త‌వ‌మేన‌ని అన్నారు. అయితే నోట్ల ర‌ద్దు చాలా మంచి నిర్ణ‌య‌మ‌ని, చ‌క్క‌గా అమ‌లు చేస్తున్నార‌ని స‌ర్వేలో పాల్గొన్న వారిలో అధిక‌ శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర్వ‌హించిన స‌ర్వేలో 71 శాతం మంది ఇదే విధ‌మైన అభిప్రాయం వెల్ల‌డించ‌గా, సెమీ అర్బ‌న్ ప్రాంతాల వారు 65.1 శాతం, సెమీ రూర‌ల్ జోన్స్‌ లో 59.4 శాతం మంది నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు.

ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 23.8 శాతం, సెమీ అర్బ‌న్ ప్రాంతాల్లో 24.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 36 శాతం మంది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని సమర్ధించారు. నిర్ణ‌యం మంచిదే కానీ, అమ‌లులో లోపాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు నోట్ల ర‌ద్దుతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా చిన్న‌వ‌ని, వాటి నుంచి తేలిగ్గానే బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని చాలామంది తెలిపారు. ఈ అభిప్రాయం వెల్ల‌డించిన వారిలో 38 శాతం మంది అర్బ‌న్ ప్రాంతాల‌కు చెందిన‌వారు కాగా, 35.5 శాతం మంది సెమీ అర్బ‌న్‌, 36.8 శాతం మంది గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన‌వారు.

న‌ల్ల‌ధ‌నంపై యుద్దానికి నోట్ల ర‌ద్దు ఎంత‌గానో ఉప‌క‌రిస్తుంద‌ని 86 శాతం మంది ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు, 80.6 శాతం మంది సెమీ అర్బ‌న్, 86 శాతం మంది గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. వీరిలో 83.7 శాతం మంది అతి త‌క్కువ ఆదాయం క‌లిగిన వారు కాగా 84.4 శాతం మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాలు. 90.6 శాతం మంది అధికాదాయ వ‌ర్గాల వారు ఉన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజల నుండి మోడీ నిర్ణయానికి ‘జై’ కొడుతున్నారన్న విషయం స్పష్టమైంది.