PSV Garuda Vegaతెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ ఏడాది ఫస్టాఫ్ బాగా కలిసి వచ్చింది. ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన ‘బాహుబలి 2’తో పాటు అనేక చిన్న, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా సందడి చేసాయి. కానీ సెకండాఫ్ మాత్రం పూర్తి నిరుత్సాహకరంగా సాగుతోంది. ‘స్పైడర్, జై లవకుశ’ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను రంజింప చేయకపోవడంతో, చిన్న సినిమాలే ప్రేక్షకులకు శరణమయ్యాయి.

ఆ కోవలోనే తాజాగా విడుదలైన రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. చాలాకాలం తర్వాత రాజశేఖర్ సినిమా పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో, ప్రస్తుతం ‘రాజశేఖర్ అండ్ కొ’ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఈ సినిమాపై ఓ వార్త ట్రేడ్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు మాత్రమే పుట్టుకొచ్చిన వార్త కాదు గానీ, హిట్ టాక్ వచ్చిన ప్రతి సినిమాకు ఈ ఫేక్ వార్త చాలా కామన్ గా మారిపోయింది.

హిట్ టాక్ రావడమే పాపం అన్నట్లుగా… ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్ని సినిమాలకు ఇలా ప్రేక్షకులను ఫుల్ ని చేసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా సీక్వెల్ అంటూ పబ్లిసిటీ చేయడం ఇండస్ట్రీ జనాలకు సర్వసాధారణం అయిపోయింది. అయితే ‘గరుడవేగ’ చిత్ర యూనిట్ సభ్యులు చెప్పలేదు గానీ, త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ ఊదరగొడుతున్న సినీ జనాలకు కొదవలేదు.