PSV Garuda Vega Teaser Talk Impressive But Unclear గత కొన్ని సంవత్సరాలుగా ‘హిట్’ అంటే ఏంటో తెలియని హీరో రాజశేఖర్ తో దాదాపుగా 25 కోట్లు ఖర్చు పెట్టి “గరుడ వేగ” అనే సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ కు 25 కోట్లేంటి… అని నోరెళ్ళబెట్టిన వారికి జవాబును ఇచ్చే విధంగా ఈ సినిమా టీజర్ నిలుస్తోంది. ‘గుంటూరు టాకీస్’ ఫేం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసింది.

చిత్ర నిర్మాణ సంస్థ ఖర్చు పెట్టిన 25 కోట్ల విలువ ఖచ్చితంగా ఈ సినిమాలో కనిపిస్తుందన్న నమ్మకాన్ని ఈ టీజర్ కలిగించింది. హీరో రాజశేఖర్ నుండి అస్సలు ఊహించని విధంగా టీజర్ ఉండడంతో, చూడగానే కాస్త పాజిటివ్ ఫీలింగ్ కలగడం సహజం. కానీ ఈ టీజర్ ను సరిగ్గా కట్ చేయడంలో దర్శకుడు విఫలమైనట్లుగా కనపడుతోంది. టేకింగ్ పరంగా బాగానే ఉంది గానీ, అసలు ‘కాన్సెప్ట్’ ఏంటన్నది రివీల్ చేయలేదు.

టెర్రరిజం నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ‘విశ్వరూపం’ ఫేం పూజా కుమార్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రద్ధా దాస్, అలీ వంటి ముఖ్యులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ‘పోర్న్ బ్యూటీ’ సన్నీ లియోన్ పై ఓ ఐటెం సాంగ్ ను చిత్రీకరించారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగుండడంతో, దీనికి కధ కూడా తోడయితే, రాజశేఖర్ కెరీర్ లో చాలా కాలం తర్వాత ఒక హిట్టు బొమ్మ వచ్చిందని చెప్పుకోవడానికి బాగుంటుంది.