Profeesor Nageswar comments on Pawan Kalyanఎప్పుడూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు తాజాగా మరొకర్ ఆహారంగా దొరికారా? పవన్ ను విమర్శిస్తే ఊరుకోమనే భావాలను వ్యక్తపరిచే ఫ్యాన్స్ కు, కత్తి మహేష్ కు మధ్య సత్సంబంధాలు నెలకొన్న నేపధ్యంలో… తాజాగా సీనియర్ విశ్లేషకులు నాగేశ్వర్ చేసిన కామెంట్స్ మింగుడు పడనిస్తాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

‘జనసేన’ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటివరకూ పొలిటికల్ లాబీయింగ్ లో ఉన్నారని, ఏదైనా సమస్యను గుర్తించి.. చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి, ఆయన ద్వారా పరిష్కారం చేయిస్తున్నారని సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వర్ ను ఓ పవన్ అభిమాని అడ్డుకున్నారు.

‘లాబీయింగ్’ అనే పదాన్ని నాగేశ్వర్ ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా, కౌంటర్ గా “పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఆవేశం ఆపుకుంటే ‘జనసేన’ బాగుపడుతుందని” హితవు పలికారు. ‘పవన్ కల్యాణ్ పై దోమ వాలినా దానిపై అణుబాంబు వేసి చంపుతాను’, ‘ఈగ వాలితే దానిపై రివాల్వర్ పేలుస్తాను’ అనే లక్షణం వల్ల పవన్ కల్యాణ్ కు నష్టం తప్ప, నాకేమీ నష్టం లేదు..నా కొంప మునిగేదేమీ లేదుని స్పష్టంగా తెలిపారు.

ఈ ధోరణి మంచిది కాదని చెబుతున్నాను. ‘లాబీయింగ్’ అనేది చెడ్డ పదమేమీ కాదు. అమెరికాలో అయితే లాబీయిస్టులు అనే ప్రత్యేక ప్రొఫెషన్ ఒకటి ఉంటుందని నాగేశ్వర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెబుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన బలమేంటో తనకే అర్థం కావట్లేదని చెబుతున్నారని, ఇంకా ఆయన బలం గురించి తానేమి చెబుతానని, అది కష్టమైన విషయమని సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

ఏపీలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తాడని, ఆయనకు కొన్ని శక్తిసామర్థ్యాలతో పాటు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారని, సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్ష ఆయనలో ఉందని అన్నారు. కానీ, పూర్తి స్థాయి రాజకీయాలు నడిపే పద్ధతి వేరేగా ఉంటుందని, సంబంధిత అంశాలపై పోరాటం చేయడం, ప్రజలను సమీకరించడం వంటివి ఉంటాయని అన్నారు.

రాజకీయపార్టీలు లాబీయింగ్ ద్వారా కాకుండా రాజకీయాల వల్లే అభివృద్ధి చెందుతాయని, లాబీయింగ్ అనేది స్వచ్ఛంద సంస్థలు లేదా రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులు చేసే పని అని అన్నారు. సమస్యలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకే అయితే, రాజకీయ పార్టీని పవన్ స్థాపించాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు.

అపారమైన జనాదరణ పొందిన నటుడు పవన్ కల్యాణ్ కు సొంతంగా ఏ రాజకీయపార్టీ లేకున్నా కూడా ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లొచ్చని, ఆయా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లొచ్చని సూచించారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ కార్యాచరణ ఉండాలనేది తన అభిప్రాయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.