Prof. Kodandaramతెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్ తరువాతి కాలంలో కేసీఆర్ తో విభేదించి… సొంత పార్టీ పెట్టుకున్నారు. చాలా విషయాల మీద ప్రభుత్వం మీద గట్టిగానే విమర్శలు చేస్తూ వచ్చారు. 2018లో కోదండరామ్ కు చెందిన తెలంగాణ జన సమితి పార్టీ మహాకూటమిలో భాగంగా ఎనిమిది సీట్లలో పోటీ చేసింది.

వాటిలో ఏడు సీట్లలో డిపాసిట్లు కూలిపోయింది. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఎన్నికల ఓటమి తరువాత ఆయన పూర్తిగా నిస్తేజంగా ఉండిపోయారు. తాజాగా మరోసారి ప్రజల ముందుకు వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. త్వరలో జరగబోయే వరంగల్ – కరీంనగర్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆయన పోటీలో ఉంటారని సమాచారం.

బీజేపీ కాకుండా మిగతా ప్రతిపక్షాలు తమకు మద్దతు ఇస్తారని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2018 ఎన్నికలలో తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థులకు పోస్టల్ బాలట్ లో గణనీయ స్థాయిలో ఓట్లు వచ్చాయి.

దానితో చదువుకున్న వారిలో కోదండరామ్ కు మద్దతు ఉందని ఆయన అభిప్రాయం. ఆ ఆశతోనే ఆయన ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నికైతే మండలిలో ప్రతిపక్షం తరపున ఒక గట్టి వాయిస్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికార తెరాస పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.