Producer Yash Chopraఅనుకుంటాం కానీ వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకూ బోలెడు కథలు కష్టాలు ఉంటాయి. బయటికి కనిపించినంత అందంగా ప్రయాణం ఉండదు.వాళ్ళుగా బయటికి చెప్పే దాకా ప్రపంచానికి తెలియని నిజాలు ఎన్నో ఉంటాయి. సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన నలభై ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ లో మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. నెట్ ఫ్లిక్స్ కోసం ది రొమాంటిక్స్ పేరుతో తీసిన డాక్యూమెంటరీ సిరీస్ లో ఆయన చెప్పిన సంగతులు కొన్ని ఆశ్చర్యానికి కొన్ని షాక్ గురి చేస్తాయి. తమ లెజెండరీ బ్యానర్ వెనుక కథలను మొదటిసారి ఆడియన్స్ ముందు గుట్టు విప్పారు. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, షారుఖ్, హృతిక్, రణ్వీర్ సింగ్, మాధురి దీక్షిత్ అందరూ కబుర్లు పంచుకున్నారు.

సుప్రసిద్ధ దర్శక నిర్మాత యష్ చోప్రా తనయుడే ఆదిత్య చోప్రా. రాజేష్ ఖన్నాతో తీసిన దాగ్ తో దర్శక ప్రస్థానం మొదలుపెట్టిన యష్ జీ 80వ దశకం వరకు తిరుగులేని చక్రం తిప్పారు. సిల్ సిలా, కభీ కభీ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఇచ్చారు. తర్వాత వరసగా పలకరించిన పరాజయాలు ఆయన్ను మానసికంగా కృంగదీశాయి. కమర్షియల్ జానర్ ట్రై చేస్తే అక్కడా దెబ్బ తిన్నారు. ఇక చావో రేవో తేల్చుకుందామని శ్రీదేవితో చాందిని ఇస్తే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అదే కాన్ఫిడెన్స్ తో లమ్హే తీస్తే పెద్ద దెబ్బ పడింది. కథ ప్రకారం తండ్రి వయసున్న హీరోని కూతురి ఈడున్న హీరోయిన్ పిచ్చిగా ప్రేమించడం ప్రేక్షకులకు జీర్ణం కాలేదు. ఫలితం డిజాస్టర్.

షారుఖ్ ఖాన్ డర్ తో కొత్త చరిత్ర మొదలయ్యింది. వీటన్నింటి వెనుకా టీనేజ్ వయసు నుంచి ఆదిత్య తండ్రి వెన్నంటే ఉన్నాడు. తన డెబ్యూ కోసం ఆదిత్య చోప్రా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే స్క్రిప్ట్ రాసుకుని ఎవరి భాగస్వామ్యం లేకుండా స్వంతంగా తీద్దామనే కండీషన్ మీద యష్ చోప్రాని ఒప్పించి తీస్తే రాత్రికి రాత్రి షారుఖ్ ని స్టార్ లవర్ బాయ్ గా మార్చి పారేసింది. ఇక్కడ ప్రయాణం సాఫీగా కనిపించినా ఎగుడుదిగుడుల ప్రభావం యష్ సంస్థ మీద బలంగా పని చేసింది. తర్వాత ఆదిత్య తీసిన మొహబ్బతే సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత నిర్మాతగా మారిపోయి పూర్తిగా కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కొత్త పాత్రలో సవాళ్ళను తీసుకున్నారు.

హృతిక్ రోషన్ ముజ్సే దోస్తీ కరోగి లాంటివి తేడా కొట్టాయి కానీ వెంటనే కోలుకుని కథల విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల ఒకటే జానర్ కి కట్టుబడకపోవడంతో ధూమ్ లాంటి కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. రబ్ నే బనాదీ జోడితో ఆదిత్య డైరెక్టర్ గా మళ్ళీ విజయం అందుకున్నారు. కానీ 2016లో కంబ్యాక్ గా చేసిన బేఫికరే తీవ్రంగా నష్టాలు తేవడంతో తాను కొత్త జనరేషన్ కు తగ్గట్టు ఆలోచించలేదని అర్థం చేసుకుని తిరిగి ప్రొడ్యూసర్ చైర్ కే పరిమితమయ్యారు. పఠాన్ వెయ్యి కోట్ల వసూళ్లకు ఈయన తపనే కారణం. తండ్రి చివరిగా దర్శకత్వం వహించిన జబ్ తక్ హై జాన్ ఆశించిన విజయం సాధించకపోవడం ఒకటే ఇప్పటికీ లోటుగా భావిస్తారు. ఇంకా ఎన్నో సంగతులు ఈ రొమాంటిక్స్ లో పంచుకున్నారు. మనకూ తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, రామకృష్ణ స్టూడియోస్, గీత ఆర్ట్స్, వైజయంతి మూవీస్ లాంటి బ్యానర్లు ఇలాంటివి తీస్తే బాగుంది.