C-Kalyan-interview-chiranjeeviటాలీవుడ్ లో ఒకప్పుడు చిన్న సినిమాలకు వెన్నుదన్నుగా ఉన్న నిర్మాత సి.కళ్యాణ్, గత అయిదారు సంవత్సరాల క్రితం వరుసగా మహేష్, పవన్ వంటి స్టార్ హీరోల సినిమాల నిర్మాణంలో భాగస్వామి అయి సంచలనం సృష్టించారు. అలాగే వర్మతో ‘రక్తచరిత్ర’ వంటి సినిమాలను నిర్మించి హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే మద్దెలచెరువు సూరి హత్య తదనంతర ఉదంతాలలో పోలీస్ వర్గాల నుంచి విచారణ ఎదుర్కొన్న కళ్యాణ్ తో ఓ ప్రముఖ టెలివిజన్ సంస్థ జరిపిన ‘ముఖాముఖి’ కార్యక్రమంలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంకా ప్రజల్లో పొలిటికల్ మైలేజ్ ఉంటుందని మీరు భావిస్తున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు… నిజానికి చిరంజీవి పార్టీ పెట్టాక కాపులు నాశనమైపోయారు. ఒక ఉత్సాహంతో ప్రారంభమైన పార్టీ చివరకు నీరుగారిపోయిందని విశ్లేషించారు. అలాగే ఇదే తీరున పవన్ కొనసాగితే, 2019 ఎన్నికలలో నూటికి 200 శాతం పవన్ కళ్యాణ్ కూడా ఫెయిల్యూర్ అవుతారని అన్నారు. రాజకీయ నాయకుడెపుడూ ప్రజల్లో ఉండాలే గానీ, ట్విట్టర్లో సందేశాలు పెడితే సరిపోదని పవన్ అనుసరిస్తున్న విధానం పట్ల కామెంట్స్ చేసారు. మెగా ఫ్యామిలీకి ప్రజల్లో పొలిటికల్ ఇమేజ్ లేదని కుండబద్దలు కొట్టారు.

ఇక, కాపు కార్పొరేషన్ అన్నది ఒక పొలిటికల్ గేమ్ మాత్రమేనని, ఎన్నికల సమయానికి పార్టీలు వాడుకుంటానికి తప్ప ఏమీ ఉపయోగం ఉండదని, అసలు కాపులలో వారిలో వారికే ఐక్యత ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసారు. తన గురువు గారు దాసరి నారాయణరావు ఇపుడు ప్రత్యేకంగా పార్టీ పెట్టి ఏం చేస్తారని, ఆయన పార్టీ పెట్టరన్న విశ్వాసం తనకు ఉందని, మీకు అందిన సమాచారం తప్పుడుదై ఉంటుందని అన్నారు.