Pro Kabaddi League 2016, Pro Kabaddi League 2016 Season 4,Pro Kabaddi League 2016 Patna Pirates Won, Pro Kabaddi 2016 Telugu Titans, Pro Kabaddi 2016 Jaipurగత నెల రోజులకు పైగా సందడి చేసిన ప్రొ కబడ్డీ లీగ్ ఆదివారం నాడు జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పింక్ పాంథర్స్ జైపూర్ ను చిత్తు చేసిన పట్నా పైరేట్స్ మరోసారి టైటిల్ ను ఎగురవేసుకుపోయింది. దీంతో పట్నా పైరేట్స్ వరుసగా రెండో సారి ప్రో కబడ్డీ విజేతగా నిలిచింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 37-29 పాయింట్ల తేడాతో పైరేట్స్ చేతిలో పాంథర్స్ ఓటమి పాలయ్యింది. మ్యాచ్ ప్రారంభంలో సత్తా చాటిన పింక్ పాంథర్స్ క్లైమాక్స్ లో మాత్రం చేతులెత్తేసింది.

సింగిల్ మ్యాచ్ లో ఏకంగా 16 పాయింట్లను సాధించిన పైరేట్స్ ఆటగాడు పర్దీప్ నర్వాల్ తన జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు. పాంథర్స్ కెప్టెన్ జస్వీర్ సింగ్ ఒంటిచేత్తో 13 పాయింట్లు సాధించినా పైరేట్స్ దూకుడును అడ్డుకోలేకపోయాడు. మ్యాచ్ లో తొలి అర్ధభాగం ముగిసే సరికి పైరేట్స్ తో సరిసమానంగా 16 పాయింట్లు సాధించిన పాంథర్స్…. సెకండాఫ్ లో పూర్తిగా నిరాశజనకమైన ఆట తీరుని ప్రదర్శించింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పైరేట్స్ ఆటగాళ్లు ఒక్కసారిగా జూలు విదల్చడంతో, ప్రొ కబడ్డీలో వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది.

ఇక, ప్లే ఆఫ్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ – పూణేరి పల్తాన్ జట్లు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో… చివరి నిముషంలో జరిగిన డ్రామాతో విజయం పూణేరి పల్తాన్ వశమైంది. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు విక్టరీ వెంకటేష్, దగ్గుపాటి రానాలు మరోసారి స్టేడియంలో సందడి చేసి, తెలుగు టైటాన్స్ కు అండగా నిలిచారు. అయినప్పటికీ, చివరి నిముషంలో ఒత్తిడి తట్టుకోలేక తెలుగు టైటాన్స్ చేతులెత్తేసింది.