Priyanka - Gandhi Vadraప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వెనకడుగు వేసినట్టు ఉంది. ఇప్పుడు ఆమె పోటీలో లేరు. ఆమె సిద్దంగా ఉన్నా, కాంగ్రెస్ అదిష్టానం ఓకే చేయలేదని ఆ పార్టీ వారు కవర్ చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తొలి నాళ్లలోనే మొదటి ఎన్నికలోనే ఓడిపోతే ప్రియాంక భవిష్యత్తు రాజకీయం గందరగోళం అవుతుందని పార్టీ భావించిందని అంటున్నారు.

దాంతో గత ఎన్నికల్లో ప్రధాని మోడీపై పోటీ చేసి ఓడిపోయిన అజయ్ రాయ్ నే మరోసారి తమ అభ్యర్ధిగా కాంగ్రెస్ ప్రకటించింది. గతంలో రాహుల్ ఆదేశిస్తే పోటీకి తాను కూడా రెడీ అని ప్రియాంక గాంధీ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సర్వే ఫలితాలు అన్నీ బేరీజు వేసుకున్నాకా మళ్ళీ తెరపైకి అజయ్ రాయ్ వచ్చారు. 2014లో వారణాసిలో ప్రధాని మీద అజయ్ రాయ్‌తో పాటు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పోటీ చేశారు. కానీ విజయం మోదీనే వరించింది.

ప్ర‌స్తుతం ఈస్ట్ యూపీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లను చేపట్టిన ప్రియాంక ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసలు ఆమె ఈ ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో చూడాలి. వారణాసి లో పోలింగ్ మే 19న ఏడవ విడత ఎన్నికలు జరగనున్న విష‌యం తెలిసిందే. మరోవైపు మోదీ వార‌ణాసిలో గురువారం రోడ్ షో నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత సాయంత్రం గంగా హార‌తిలో పాల్గోనున్నారు. రాజకీయ విశ్లేషకుల ప్రకారం నరేంద్ర మోడీ ఈ సారి కూడా మళ్ళీ భారీ ఆధిక్యంతో గెలుస్తారట.