Prathipati Pullarao Wifeఅధికారంలో ఉండే వారే కాదు… వారి కుటుంబ సభ్యులు కూడా అధికార మత్తులో జోగుతూ ఉంటారు. టోల్ గేట్ల వద్ద తమను డబ్బులడిగితే నేనెవరో తెలుసా? నన్నే ఆపుతావా అంటూ రెచ్చిపోతారు. కోట్లకు పడగనెత్తి వందా రెండొందలకు కక్కుర్తి పడి అనవసరంగా వార్తల్లో నిలుస్తారు. సరిగ్గా అదే జరిగింది గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ వద్ద. మంత్రి పత్తిపాటి పుల్లరావు సతీమణి ప్రయాణిస్తున్న కారును టోల్ ప్లాజా సిబ్బంది ఆపారు. 135 రూపాయిలు కట్టాల్సిందిగా అడిగారు.

నేనే ఎవరో తెలుసా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె కారుకు ఉన్న ఎమ్మెల్యే స్టిక్కరు చూపించారు. అయితే రూల్స్ ప్రకారం కారులో ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే మాత్రమే టోల్ కట్టనవసరం లేదని.. ఆయన కారులో లేకపోతే కట్టాల్సిందే అని సిబ్బంది ఆమెకు చెప్పే ప్రయత్నం చేశారు. మాములుగా అయితే ఊరుకునే వారేమో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండటంతో వారు కూడా గట్టిగానే ఉన్నారు. అయినా వినకుండా ఆమె వాదనకు దిగడంతో వారు కూడా అంతే గట్టిగా చెప్పారు.

చివరికి చేసేది ఏమీ లేక ఆమె డబ్బులు కట్టి అక్కడ నుండి వెళ్లారు. ఆమె నిర్వాకమంతా అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యింది. అది మీడియాలో వస్తుంది. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందించాలని, అధికార దర్పం చూపే ప్రయత్నం చేసినందుకు మంత్రిగారి ని పిలిపించి మందలించాలని వారు గట్టిగా కోరుకుంటున్నారు.