Prashant-Kishor-YS-Jagan-YSRCPఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి మన రాష్ట్ర రాజధాని ఏదో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అమరావతి ఇక లేదనుకొని పక్కన పెట్టేసి చెప్పాలనుకొన్నా, విశాఖ రాజధాని అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఓ మంత్రి బెంగళూరులో పెట్టుబడిదారులకి ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అని చెపుతారు. వెంటనే మంత్రులు ప్రెస్‌మీట్‌ పెట్టి ఏపీకి ఒకటి కాదు… మూడు రాజధానులే ఉంటాయని చెపుతారు.

అంటే పెట్టుబడిదారులకి ఒక్క రాజధాని ఉంటుందని, ప్రజలకి మూడు రాజధానులు ఉంటాయని మంత్రులు చెపుతున్నారన్న మాట! అంటే రాజధాని అమరావతా… లేక మూడు రాజధానులా అనే గందరగోళమే కాక, ఒక్క రాజధానా… మూడా అనే మరో గందరగోళం కూడా ఉందన్న మాట!

రాజధాని విషయంలో మంత్రులు ఇంత గదరగోళం సృష్టించడం చూస్తుంటే వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీని గెలిపించేందుకు కాంట్రాక్ట్ తీసుకొన్న ఐ-ప్యాక్ ఐడియాయేనా?ఇది అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గత ఎన్నికలలో ‘అమరావతే రాజధాని’ అని చెప్పమని సలహా ఇచ్చింది అదే. అలాగే చెప్పుకొని వైసీపీ అధికారంలోకి వచ్చింది. కనుక ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ ఐ-ప్యాక్ సలహా మేరకే మంత్రులందరూ కలిసి గందరగోళం సృష్టిస్తున్నారేమో?అనే సందేహం కలుగుతోంది.

ఈ గందరగోళంతో వైసీపీకి నష్టం కలుగుతుందని ఐ-ప్యాక్ భావించి ఉంటే చూస్తూ ఊరుకోదు కదా?వెంటనే జగనన్నని హెచ్చరించి ఉండేది. కానీ ఒకటీ… మూడు… విశాఖ రాష్ట్రం అంటూ మంత్రులు చెలరేగిపోతుంటే వారిని సిఎం జగన్మోహన్ రెడ్డి వారించే ప్రయత్నం చేయడం లేదంటే ఇది ఖచ్చితంగా ఐ-ప్యాక్ వ్యూహమే అయ్యుండవచ్చనిపిస్తోంది.

గందరగోళం సృష్టించడం ఎందుకంటే మిగిలిన ఈ కొద్దిపాటి పుణ్యకాల్యంలో మూడు రాజధానులు ఎలాగూ ఏర్పాటు చేయడం సాధ్యం కాదు కనుక! ఈవిదంగా ప్రజలలో గందరగోళం సృష్టిస్తూ ఎన్నికల వరకు కాలక్షేపం చేసేస్తే, ఆ తర్వాత అమరావతా… ఒకటా… మూడా అనేది ఎలాగూ తేలిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తగా ఆట మొదలుపెట్టవచ్చని ఐ-ప్యాక్ సలహా ఇచ్చి ఉండవచ్చు.

అయితే ఇప్పుడు ఒక్క విషయం చెప్పుకోవాలి. గత ఎన్నికలకి ముందు ఆంధ్రా ప్రజలు జగనన్న పాలనని రుచి చూడలేదు కనుకనే ఐ-ప్యాక్ వ్యూహాలు ఫలించాయి. కానీ ఇప్పుడు గత మూడున్నరేళ్ళుగా రుచి చూస్తున్నారు కనుక ఈసారి ఐ-ప్యాక్ వ్యూహాలు ఫలించే అవకాశం లేదు.

మూడు రాజధానుల ఐడియా వైసీపీదే కనుక అది దానికే కట్టుబడి ఉండక తప్పదు. అదే అజెండాతో ఎన్నికలకి వెళ్ళకతప్పదు. కానీ “మాట తప్పను-మడమ తిప్పను,” అని గొప్పగా చెప్పుకొన్న జగనన్న తను స్వయంగా కనిపెట్టిన ఈ మూడు రాజధానుల కాన్సెఫ్ట్‌కి కూడా కట్టుబడిలేరనే విషయం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజా ప్రకటనతో స్పష్టమైంది. కనుక రాయలసీమ, కోస్తా ప్రజల ఆగ్రహానికి వైసీపీ బలికాక తప్పదు.

కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ మొదటి నుంచి అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నాయి. ఎవరూ మాట తప్పలేదు… మడమ తిప్పలేదు. కనుక వాటికే విశ్వసనీయత ఎక్కువగా ఉంది. కనుక మూడు రాజధానులతో గేమ్ మొదలుపెట్టి విశాఖ రాజధానితో ముగించాలనుకొన్న వైసీపీ ఈ స్వయంకృతాపరాధానికి వచ్చే ఎన్నికలలో మూల్యం చెల్లించక తప్పదు. వైసీపీని ఈసారి ఐ-ప్యాక్, కేసీఆర్‌ కూడా కాపాడలేకపోవచ్చు. కనుకనే శల్యసారధ్యం చేస్తున్నట్లుంది.