Prashant Kishore tweeted he was not going to join the Congress partyఎన్నికల వ్యూహానిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరబోవడం లేదని ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు తనకి ఎంతో ఉదారంగా అవకాశం కల్పించినప్పటికీ చేరలేకపోతున్నానాని, మీ పార్టీకి తన కంటే సంస్థాగత సమస్యలు, నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని సమూలంగా మార్పులు చేసుకొని వెళితేనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆయన ట్వీట్ సారాంశం.

ఆయన కాంగ్రెస్‌లో చేరకపోవడానికి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

ఆయన తన ఆలోచనల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు పార్టీలో కీలక పదవి ఆశించగా దానికి పార్టీ అధిష్టానం నిరాకరించినందునే ఆయన పార్టీలో చేరలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆయన కాంగ్రెస్‌తో విభేదిస్తున్న టిఆర్ఎస్‌, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలకు సేవలు అందిస్తుండటం, వాటి అధినేతలతో సన్నిహితంగా మెలుగుతుండటం ఓ కారణంగా కనిపిస్తోంది. ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకొంటే ఆయన ద్వారా తమ పార్టీ బలహీనతలు, రహస్యాలు, వ్యూహాలు అన్నీ తమ ప్రత్యర్ధులకు చేరిపోతాయని, తెలంగాణలో టిఆర్ఎస్‌ కోసం పనిచేయడానికి ఆయన సిద్దపడటమే ఇందుకు తాజా నిదర్శనమని సీనియర్ నేతలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

కనుక ఆయనను పార్టీలో చేర్చుకొంటే మొదటికే మోసం వస్తుందని వారు గట్టిగా హెచ్చరించడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించినట్లు తెలుస్తోంది. ఒకసారి కాంగ్రెస్‌ పగ్గాలు ప్రశాంత్ కిషోర్‌ చేతికి అప్పజెప్పితే ఆయన ఇష్టారాజ్యంగా పార్టీని నడిపించుకొంటూ ఏదో ఓ రోజున తమనే బయటకి పంపించేస్తారనే భయం ఆ పార్టీ అధిష్టానంలో, సీనియర్ నేతలలో ఉంది.

ఇది కాంగ్రెస్‌ వెర్షన్‌ కాగా, ప్రశాంత్ కిషోర్‌ తరపు నుంచి చూస్తే, ప్రజలపై కర్ర పెత్తనం చేసే రాజకీయ పార్టీలను, వాటి అధినేతలను తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తూ వారి దగ్గర నుంచే ముక్కు పిండి ఫీజు రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అదే…కాంగ్రెస్ పార్టీలో చేరితే ఫ్రీగా పనిచేయాల్సి వస్తుంది. ఇతర పార్టీలకు పనిచేసి డబ్బు సంపాదించుకొనేందుకు వీలుండదు. ఇదీగాక కాంగ్రెస్‌ పార్టీకి సమర్ధమైన నాయకత్వం లేదంటూ సోనియా, రాహుల్ గాంధీలను విమర్శిస్తున్న ఆయన పార్టీలో చేరితే మళ్ళీ వారి కిందే, వారు చెప్పినట్లుగానే చేతులు కట్టుకొని పనిచేయవలసి ఉంటుంది. పైగా కాంగ్రెస్‌లో కుమ్ములాటలలో ఆయన కూడా పాల్గొనక తప్పదు.

కనుక ఒకసారి కాంగ్రెస్‌ కండువా కప్పుకొంటే సాధారణ కాంగ్రెస్‌ నేతగా మారిపోతారు. దీంతో ఏ పార్టీనైనా గెలిపించగల గొప్ప ఎన్నికల వ్యూహానిపుణుడిగా ఆయన సంపాదించుకొన్న పేరు తుడిచిపెట్టుకుపోతుంది.

అదే…ఎప్పటిలాగే కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలకు అవుట్ సోర్సింగ్ సేవలు అందిస్తున్నట్లయితే, అన్ని పార్టీలు ఆయన గుప్పెట్లో ‘పడి ఉంటాయి’ కూడా. పైగా ముక్కు పిండి డబ్బు వసూలు చేసుకోవచ్చు. తెలంగాణ సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడటం లేదు కనుక కాంగ్రెస్‌ను కలుపుకోకుండానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయవచ్చని ప్రశాంత్ కిషోర్‌కు గట్టిగా నచ్చజెప్పడం మరో కారణం అయ్యుండవచ్చు. కారణాలు ఏవైతేనేమి…ప్రశాంత్ కిషోర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. దట్స్ ఆల్!