Prashant-Kishor-YS-Jaganఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొన్న అనాలోచిత నిర్ణయాన్ని ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ప్రతిపక్షాలతో సహా రాష్ట్ర ప్రజలందరూ తప్పు పడుతుండటంతో వైసీపీ ప్రతిష్ట దెబ్బ తింటోంది. ఈ విషయం వైసీపీ నేతలు గ్రహించారో లేదో కానీ వచ్చే ఎన్నికలలో వైసీపీ కోసం పనిచేయబోతున్న ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌కి చెందిన ఐప్యాక్ గ్రహించింది.

అందుకే అదే ముందుగా నష్టనివారణ చర్యలు చేపట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాల గురించో లేదో జగనన్న చేతికి ఎముక లేదనో ప్రచారం చేసుకొంటే అందరూ హర్షించి ఉండేవారు. కానీ ‘ఎన్నికల వ్యాపారం’ చేస్తున్న ఐప్యాక్ మరో రాజకీయ పార్టీలా మారి, వైసీపీకి మిత్రపక్షంలా వ్యవహరిస్తుండటమే దిగ్బ్రంతి కలిగిస్తోంది.

ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ చేతిలో నుంచి చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి వార్తాపత్రికలను పోస్టర్లుగా అచ్చువేయించి విజయవాడ నగరంలో గోడలపై అంటింపజేసింది. ఆనాడు డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో ఎన్టీఆర్‌ గురించి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను డెక్కన్ క్రానికల్‌తో సహా పలు వార్తా పత్రికలలో ఫ్రంట్ పేజీలో వచ్చాయి. టిడిపి, చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాటిని ఐప్యాక్ ఇప్పుడు బయటకు తీసింది.

అయితే, ఆనాడు ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకొని లక్ష్మీ పార్వతి టిడిపిపై పెత్తనం చలాయిస్తూ దానిని తన అధీనంలో తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నందున ఆమె బారి నుంచి టిడిపిని కాపాడుకొనేందుకే చంద్రబాబు నాయుడు అయిష్టంగానే పార్టీ పగ్గాలు చేపట్టారనే సంగతి సామాన్య ప్రజలకు కూడా తెలుసు. ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసిన పని తప్పని ప్రజలు భావించి ఉంటే మళ్ళీ ఆయనకు అధికారం కట్టబెట్టి ఉండేవారు కారు కదా? ఒకవేళ ఆనాడు చంద్రబాబు నాయుడు ధైర్యం చేసి టిడిపిని లక్ష్మీ పార్వతి నుంచి కాపాడుకోకపోయుంటే నేడు టిడిపి ఉండేదా?అందరూ కలిసి టిడిపిని కనబడకుండా చేసేసేవారు. ఈవిషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు.

కానీ చంద్రబాబు నాయుడుని అప్రదిష్టపాలు చేసేందుకు ‘పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారంటూ’ జగన్ అండ్ కో పదేపదే వాదిస్తుంటారు. అయినా కూడా 2014 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని కాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్రబాబు నాయుడుకి అధికారం అప్పజెప్పరు కదా?

టీడీపీ నేతలని, చంద్రబాబు నాయుడు బాధపడుతుంటే ఆనందించాలని ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి జగన్ ప్రభుత్వం తన కన్నును తానే పొడుచుకొంది. ఆ తప్పును సరిదిద్దుకొని ఈ వివాదం నుంచి సగౌరవంగా బయటపడే ప్రయత్నం చేయకపోగా మళ్ళీ మరో తప్పు చేస్తోంది. కోట్ల మంది తెలుగు ప్రజలు అభిమానించే ఎన్టీఆర్‌ పేరుతో దుష్ట రాజకీయాలు చేస్తే నష్టపోయేది టిడిపి కాదు వైసీపీయే అని గ్రహిస్తే మంచిది.