వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. తమ పార్టీ తరపున పనిచేసిన టీమ్ కు జగన్ కృతజ్ణతలు తెలియజేశారు. 2019లో తమ గెలుపు ఖాయమని 2024 ఎన్నికలకు కూడా మనం కలిసి పని చెయ్యాలని జగన్ చెప్పారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ఆయనకు తమ టీమ్ చేసిన సర్వే రిపోర్టును అందచేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు తక్కువలో తక్కువ 117 సీట్లు వస్తాయని వారు అంచనా వేశారట.

తెలుగుదేశం పార్టీ తమకు తురుపుముక్కగా ఉపయోగపడుతుందని భావించిన పసుపు-కుంకుమ కూడా పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని వీరు తేల్చేశారని సమాచారం. పోలింగ్ భారీగా జరగడం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకతనే సూచిస్తుందని మరింత ఎక్కువగా ఉండటంతో 117 కంటే ఎక్కువ సీట్లే రావొచ్చని కూడా వారు అభిప్రాయపడ్డారట. దీనితో వైఎస్సార్ కాంగ్రెస్ అప్పుడే పదవుల గురించి మాట్లాడుకోవడం కూడా మొదలు పెట్టారట. కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుంది అనేది వారి చర్చలలో ఉందంట.

మరోవైపు జగన్ మోహన్ రెడ్డి త్వరలో కుటుంబంతో కలిసి హాలిడేకు వెళ్ళబోతున్నారని సమాచారం. ఆయన కుమార్తె లండన్ లో చదువుకుంటుంది దీనితో అక్కడికే వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి ఆయన తిరిగి వస్తారు. ఇదిలా ఉంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కూడా ఏకంగా తమకు 130 సీట్లు వస్తాయని మీడియా సమావేశంలో ధీమా వ్యక్తం చెయ్యడం గమనార్హం. చంద్రబాబు ఈవీఎంల గురించి గొడవ పెట్టడం ఆయన ఓటమిని సూచిస్తుందని వైకాపా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.