Prashant Kishor political party-ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్‌ దేశంలో దాదాపు అన్ని ప్రధాన పార్టీలకు పనిచేసి వాటిని ఎన్నికలలో గెలిపించి అధికారంలోకి తెచ్చేందుకుగాను కోట్లాది రూపాయలు ఫీజు రూపంలో ఆర్జించారు. వాటితో సాన్నిహిత్యంగా పనిచేయడంతో వాటి ఆర్ధిక, అంగ బలాలను, వాటి నేతల బలాలు, బలహీనతలు, పార్టీల శక్తి యుక్తులు, ఎత్తుగడలు లేదా వాటి వ్యూహాలను అన్నిటినీ ప్రశాంత్ కిషోర్‌ ఔపోసన పట్టారు. అంటే దేశంలో ప్రధానమైన జాతీయ, ప్రాంతీయ పార్టీల గుట్టుమట్టులన్నీ ప్రశాంత్ కిషోర్‌ చేతుల్లో ఉన్నాయన్న మాట! ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు, ఇంతకాలం వాటి కోసం పనిచేసి ముక్కు పిండి డబ్బు సంపాదించుకోవడమే కాకుండా ఇప్పుడు వాటన్నిటికీ ఆయనే ఎసరు పెట్టడానికి సిద్దం అవుతుండటం విశేషం.

ఆయన తాజా ట్వీట్‌లో “గత పదేళ్లుగా నేను దేశంలో ప్రజాస్వామ్యయుతమైన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే ప్రభుత్వాల ఏర్పాటులో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే ప్రయత్నంలో రోలర్ కోస్టర్‌లా అనేక ఎత్తుపల్లాలను చూశాను.

ఇప్పుడు తదుపరి అధ్యాయంలో నిజమైన యజమానులైన ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అర్ధం చేసుకొని ‘జన్ సూరజ్’ (ప్రజాకాంక్షల మేరకు సమర్ధంగా పనిచేసే పాలన) వైపు అడుగు వేయవలసి ఉంటుంది,” అని సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.

అంటే ప్రజాకాంక్షల మేరకు సమర్ధంగా పనిచేసే పాలన అందించేందుకుగాను జన్ సూరజ్ అనే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లు భావించవచ్చు.