Prasant Kishor started ground work for YSRCPమరో రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాను గెలిపించడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్, క్షేత్రస్థాయి పర్యటనలను ప్రారంభించింది. పీకే టీమ్ ప్రతి మండలానికి వెళ్లి, అక్కడి స్థానిక నేతలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా వినుకొండలో ప్రశాంత్ కిశోర్ టీమ్ పర్యటించింది.

ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చలు జరుపుతూ, వచ్చే ఎన్నికల్లో ఎవరిని నిలిపితే గెలుస్తారన్న ప్రశ్న నుంచి ఎలాంటి వ్యూహాలతో అడుగేస్తే గెలుపు సునాయాసమన్న ప్రశ్నలను మండల స్థాయి నాయకులను అడుగుతున్నట్టు సమాచారం. పదవులు పొందిన నాయకుల పని తీరు, వారిపై ప్రజల్లోని అభిప్రాయాలనూ ఈ టీమ్ స్వీకరిస్తోంది. వాస్తవానికి ఈ టీమ్ పర్యటన రహస్యంగా సాగాల్సి ఉంది.

అయితే వైకాపా ఇటీవల ప్రారంభించిన నూతన కార్యాలయం వద్దకు పీకే టీమ్ రావడంతో విషయం బహిర్గతమైంది. ఇక ఉత్తరాది నుంచి వచ్చిన పీకే ప్రతి టీములో ఓ ఏపీ యువకుడు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ కిశోర్ ఇచ్చే సిఫార్సులపైనే తమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి వుంటుందని భావిస్తున్న వైకాపా నేతల్లో… ఆయన ఎటువంటి నివేదికను తమపై ఇస్తారోనన్న గుబులు మొదలైనట్టు సమాచారం.