prakash Raj deposed AP Government on Bheemla nayak Movie Issueఓ పక్కన సినిమా పరిశ్రమకు సమస్యలను తామే తీసుకువచ్చి, మరో పక్కన వాటిని పరిష్కారం వారే చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వ్యవహరిస్తోన్న తీరుపై కొంతమంది విసిగిపోయి ఉన్న మాట వాస్తవమే. అయితే ఇప్పుడిప్పుడే సమస్య సర్దుమణిగి త్వరలో కొత్త జీవో వస్తుందన్న ప్రకటనతో వేచి చూసే ధోరణిని వ్యవహరిస్తున్నారు.

కానీ తాజాగా ప్రకాష్ రాజ్ మాత్రం సూటిగా సుత్తి లేకుండా ఏపీ సర్కార్ అవలంభిస్తోన్న విధానాన్ని తూర్పారబడుతూ ఓ ట్వీట్ వేసారు. “సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి?” అంటూ నేరుగా జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. మోడీ పైనే దండయాత్ర చేసిన ప్రకాష్ రాజ్, ఏపీ సీఎం జగన్ ను నిలదీయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

“చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమె ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు” అంటూ పవన్ సినిమా ‘భీమ్లా నాయక్’ను ఉద్దేశించి స్పష్టంగా తెలిపారు ప్రకాష్ రాజ్.

ఈ వివాదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభంకార్డు వేసి, సినిమా పురోగతికి సహకరించాలని కోరారు. తెలంగాణా రాజకీయాల్లో మరియు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ తో కలిసి చర్చలు జరుపుతోన్న ప్రకాష్ రాజ్ ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన ట్వీట్ లో సినిమా తప్ప, రాజకీయ పరమైన అంశాలకు మాత్రం ఎక్కడా తావివ్వలేదు.