Prakash Raj about Mahesh babu Rajinikanthవిలక్షణ నటుడిగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసిన ప్రకాష్ రాజ్, తన అభిరుచికి తగిన విధంగా ప్రస్తుతం సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆ కోవలోనే తెరకెక్కించిన ‘మన ఊరి రామాయణం’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ అనుభవాలను చెప్పుకొచ్చారు. తన సినిమాల మాదిరే తన మాటలు కూడా కాస్త విభిన్నంగా ఉంటాయని ఈ ఇంటర్వ్యూ స్పష్టం చేసింది.

“మనుషులందరికీ కళ్లు, ముక్కు, పెదవులు ఒకేలా ఉండాలంటే కుదరదు. ఒక్కొక్కళ్లకు ఒక్కో రకంగా ఉంటాయి. అలా ఉండటమే అందం. ఇప్పుడు… రజనీకాంత్ ది అందమంటారా? లేక మహేష్ బాబు ది అందమంటారా? వాళ్లలో మనం చూడాల్సింది అది కాదు. వాళ్లలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆ ఆత్మవిశ్వాసం కారణంగానే వాళ్లు నాకు అందంగా కనిపిస్తారని” ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

“ఇండస్ట్రీలో కొందరితో విభేదాలు ఉన్న మాట నిజమేనని, ఇవన్నీ సాధారణమేనని, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు కొట్టగల్గుతామని, ఈ ప్రయాణంలో అన్నింటిని చూడాల్సిందేనని, అయితే వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సిన అవసరం మాత్రం తనకు లేదన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ముక్కోపిని. ఆ తర్వాత కొన్ని విషయాలకు మాత్రమే కోపం వస్తుండేది… అయినా మనిషికి ఉన్న బలహీనతల్లో కోపం కూడా ఒకటి కదా?” అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

“హీరో మహేష్ బాబు తనపై ఉన్న అభిమానం కొద్దీ తనను ‘ఆస్కార్’ అని పిలుస్తుంటాడని, బన్నీ ‘గురూజీ’ అంటుంటాడని, అదే విధంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు వారి వారి అభిమానం కొద్దీ పిలుస్తుంటారని… తనను సినీ హీరోలు ఎంతగా ఇష్టపడతారో” చెప్పారు ఈ విలక్షణ నటుడు. హీరోలు ఎన్ని రకాలుగా పిలిచినా, అభిమానులు మాత్రం ‘వీడు సామాన్యుడు కాడు’ అని ప్రకాష్ రాజ్ ను ముద్దుగా పిలుచుకుంటారు.