Praja-Vedika-Demolition-Telangana-Police-Command-Control-Centre-Inaugurationతెలంగాణ సిఎం కేసీఆర్‌ ఈరోజు హైదరాబాద్‌, బంజారా హిల్స్ వద్ద రూ.585 కోట్లు వ్యయంతో నిర్మించిన ‘తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ (టీఎస్‌ఐసీసీసీ)కు ప్రారంభోత్సవం చేశారు. అత్యాధునిక టెక్నాలజీ, సదుపాయాలతో నిర్మించిన టీఎస్‌ఐసీసీసీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ దానితో అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సిసి కెమెరాలలో రికార్డ్ అవుతున్న దృశ్యాలను కూడా అక్కడి నుంచే చూసి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు.

సుమారు 600 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న అత్యద్భుతమైన సచివాలయం కూడా మరో మూడు నాలుగు నెలల్లో ప్రారంభోత్సవం కానుంది. అదేవిదంగా తెలంగాణలో అన్ని జిల్లాలలో ఒక్కోటి రూ.60-75 కోట్లు వ్యయంతో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు కూడా నిర్మిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వాటిలోనే ఉండేవిదంగా నిర్మిస్తున్నారు.

కరోనా నేర్పిన పాఠాలతో హైదరాబాద్‌ నలుదిశలా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలని నిర్ణయించి వాటికీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (టిమ్స్‌) ఉన్నందున రూ.1200 కోట్ల వ్యయంతో మరో మూడు నిర్మిస్తోంది. వరంగల్‌లో రూ.1,200 కోట్లు వ్యయంతో 53 ఎకరాల విస్తీర్ణంలో 24 అంతస్తులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తోంది.

ఇప్పటికే ఐ‌టి రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను ఇప్పుడు మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో రూ.945 కోట్లు వ్యయంతో రాయదుర్గంలో ఇమేజ్ టవర్ నిర్మించబోతోంది. ఇక హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్లైఓవర్లకు లెక్కే లేదు. ఇలా చెప్పుకొంటూ పోతే ఓ పుస్తకమే వ్రాయాల్సి ఉంటుంది.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అక్కడే ఉంటున్న మన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరూ గర్వించే గొప్ప రాజధాని నిర్మించుకోవాలని, తెలంగాణలాగే మనం కూడా మనరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారికి అనిపించకపోవడం ఏపీ ప్రజల దురదృష్టం, దౌర్భాగ్యం అనుకోవాలి.

అభివృద్ధి చేయకపోయినా కనీసం ఉన్నవాటినైనా కాపాడుకోవచ్చు కదా? కానీ అదీ లేదు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాలనలో మూడేళ్ళుగా కూల్చివేతలే తప్ప ఒక్క నిర్మాణం జరుగలేదు. పచ్చగా కళకళలాడుతుండే రుషికొండను రేయింబవళ్ళు తవ్వేసి పెద్ద మట్టి దిబ్బగా మార్చేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసిన గుంతలు పడిన రోడ్లే అని ప్రతిపక్షాలు ఫోటోలు వీడియోలు పెట్టి చూపిస్తున్నా జగన్ ప్రభుత్వంలో స్పందన లేదు.

తెల్లారిలేస్తే అప్పులు, సంక్షేమ పధకాలు, గడప గడపకి, ఎన్నికలు, ప్రతిపక్షాలను, మీడియాను తిట్టుకోవడంతోనే సరిపోతోంది. ఇక అభివృద్ధి గురించి ఆలోచించే సమయం, ఓపిక, ఆసక్తి ఎక్కడ?ఒక్క ఛాన్స్‌కే రాష్ట్రాన్ని శ్రీలంక, బీహార్ పక్కన నిలబెట్టిన జగన్ ప్రభుత్వం మరో ఛాన్స్ ఇస్తే ఏం చేస్తుందో?