prabhu-devaకొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించి నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా, ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అభినేత్రి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా, జూనియర్ ఆర్టిస్టులు, 350 మంది డ్యాన్సర్లతో టైటిల్ సాంగ్‌ను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు.

సోనూసూద్ సహా ప్రధాన తారాగణంపై చిత్రీకరిస్తున్న పాటకు ప్రభుదేవా నృత్యాలు కంపోజ్ చేస్తుండగా ప్రభుదేవా ఒక్కసారిగా వెన్నునొప్పితో విలవిల్లాడిపోయారు. దీంతో వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించామని, కొన్ని రోజుల పాటు ప్రభుదేవాకు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లుగా నటుడు సోనూసూద్ తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుగానే ఉందని, కోలుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ‘అభినేత్రి’ సినిమా తెలుగుతో పాటు మరో రెండు భాషలలో కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. తమిళంలో ‘దేవి’గా, హిందీలో ‘టూటక్ టూటక్ టుటియా’గా తెరకెక్కుతుండగా, ఇటీవల విడుదలైన మూడు భాషల టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించడంతో, ప్రభుదేవా వెన్నునొప్పి విడుదల తేదీలో ఏమైనా మార్పు చేస్తుందేమో చూడాలి.