Prabhas word to Saaho distributorsయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మొదటి వారాంతంలో చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి దాదాపుగా 153 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సాహూ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 290 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే సినిమా టాక్ కంటే బెటర్ గా పెర్ఫర్మ్ చేస్తున్నా అది కష్టమనే చెప్పుకోవాలి. పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

ఈ క్రమంలో నిర్మాతలు ప్రభాస్ ఫ్రెండ్స్ (యూవీ క్రియేషన్స్) ఇప్పటికే తరువాత ఏంటి అనే దాని మీద సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. సాహూ ని విడుదల చేసిన వారికే ప్రభాస్ తో తమ తదుపరి చిత్రం జాన్ రైట్స్ ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారట. ఆ సినిమా రేట్లు కూడా కొంచెం అటుఇటుగా ఇవ్వబోతున్నారని తెలిసింది. అయితే దీనిపై క్లారిటీ సాహూ రన్ పూర్తయ్యాకే వస్తుంది. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం అనేది మంచి విషయమే.

సాహూ లాగే జాన్ ని కూడా ఒక రెండో సినిమా దర్శకుడితో చేస్తున్నాడు ప్రభాస్. గోపీచంద్ జిల్ సినిమాకు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే సినిమా షూటింగ్ 40% పూర్తయ్యిందట. వచ్చే వేసవికి విడుదల చేయనున్నట్టు సమాచారం. బాహుబలి, సాహూ చిత్రాలలాగే ఆ సినిమాను కూడా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో ఒకేసారి విడుదల చెయ్యబోతున్నారు. విడుదల తేదీ ఖరారు చెయ్యాల్సి ఉంది. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.