Prabhas says Sharwanand next superstarఆడియో వేడుకలపై మాట్లాడడం అనేది ఓ కళ. ఇందులో సిద్ధహస్తులుగా మెగా కాంపౌండ్ హీరోలు నిలుస్తారు. చిరంజీవితో మొదలైన ఈ ఒరవడిలో పవన్ కళ్యాణ్ కాస్త వెనుకపడినట్లుగా కనిపించినప్పటికీ, గత కొన్ని సంవత్సరాలుగా స్టేజ్ ఎక్కితే మైక్ వదలడం లేదన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్, బన్నీల విషయం చెప్పనవసరం లేదు. మెగా కాంపౌండ్ హీరోలు కాకుండా ఆడియో వేడుకలపై సుదీర్ఘమైన ప్రసంగాలు చేయడంలో జూనియర్ ఎన్టీఆర్ నైపుణ్యం వర్ణనాతీతం.

అగ్ర హీరోల జాబితాలో ఉన్న మహేష్… ఓ నాలుగు ముక్కలు స్పష్టంగా మాట్లాడి, ఒకటి, రెండు నిముషాల్లో తన ప్రసంగాలను ముగించేస్తాడు. కానీ ప్రభాస్ మాత్రం ఇలా కాదు. బాగా మొహమాటం ఎక్కువన్నట్లు మాట్లాడుతుంటారు. అది కూడా ఏ మాత్రం స్పష్టత లేకుండా! తాజాగా “మహానుభావుడు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరైన ప్రభాస్, మరోసారి తనలోని ‘ఈవెంట్ ఫియర్’ను బయటపెట్టుకున్నాడు. శర్వానంద్ గురించి మాట్లాడుతూ… ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అన్నట్లు… చివరికి కాబోయే ‘సూపర్ స్టార్’ అంటూ ముగించారు.

ఈ వ్యాఖ్యలతో పక్కన ఉన్న శర్వానంద్ కూడా ఇబ్బంది పడడం గమనించవచ్చు. శర్వానంద్ గురించి ఎంతో గొప్పగా, ఏదో చెప్పాలనే ప్రయత్నంలో, ప్రభాస్ చివరికి ఇంకేదో చెప్పినట్లుగా కనపడుతోంది. అయితే ఇలా వ్యాఖ్యానించడం ప్రభాస్ కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలా ప్రసంగించిన సందర్భాలున్నాయి. బయట సినిమాలకే కాదు, తన చిత్రాల గురించి కూడా ఇలా పొడిపొడిగా స్పష్టత లేకుండా మాట్లాడడం ప్రభాస్ కు అలవాటై పోయినట్లుంది. ‘బాహుబలి 2’ విషయంలో మాత్రం ఇలా కనిపించలేదంటే… బహుశా జక్కన్న ట్రైనింగ్ ఇచ్చారేమో… అనిపించక మానదు.