prabhas role in rajamouli's RRRదర్శకదిగ్గజం రాజమౌళి – రెబల్ స్టార్ ప్రభాస్ ల నడుమ ఎలాంటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’ రెండు పార్టులతో ప్రభాస్ ను ఎక్కడో శిఖరాన నిలబెట్టిన రాజమౌళి, ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో “ఆర్ఆర్ఆర్” ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వైనం తెలిసిందే.

ఈ సినిమా 25వ తేదీన విడుదల కానుండగా, మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న “రాధే శ్యామ్” కోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాలుపంచుకున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా ప్రభాస్ ను అనేక ప్రశ్నలు అడగగా, దానికి ప్రతిగా ప్రభాస్ కూడా ఓ ఆసక్తికరమైన ప్రశ్నను జక్కన్నకు సంధించారు.

ఎన్టీఆర్ – చరణ్ లతో తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్”లో తనకు కూడా ఓ రోల్ ఇవ్వాలనిపించలేదా? వారిద్దరితో పాటు నేను కూడా సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తే బాగుండేది కదా, మీరు తలచుకుంటే తనకు ఓ పాత్రను సృష్టించడం పెద్ద విషయం కాదేమో… అంటూ డార్లింగ్ అడిగేయగా, దానికి జక్కన్న కూడా అంతే తెలివిగా సమాధానం చెప్పారు.

బాబు నువ్వు ఓ పెద్ద షిప్ లాంటివాడివి. నేను అడిగితే నువ్వు కాదనవన్న నమ్మకం నాకూ ఉంది. ఆ షిప్ లాంటి రోల్ ఉంటే నిన్ను రిక్వెస్ట్ చేసైనా చేయించుకునేవాడిని, కానీ బలవంతంగా ఆ షిప్ ను తీసుకువచ్చి ఓ సన్నివేశంలో ఇరికించలేను అంటూ నవ్వేసారు. సమయస్ఫూర్తిగా సమాధానాలు అందించడంలో ఎంతైనా జక్కన్న దిట్ట కదా అని మరోసారి నిరూపించారు.