Prabhas Replaces Mahesh Babuఅగ్ర హీరోల సరసన హీరోయిన్ల ఎంపిక ఇటీవల కాలంలో కాస్త సంక్లిష్టంగా మారుతున్న వైనం తెలిసిందే. ముఖ్యంగా క్రేజీ కాంభినేషన్ల కోసమని బాలీవుడ్ హీరోయిన్లతో సంప్రదింపులు జరుపుతుండడం, అవి సఫలీకృతం కాకపోవడం తెలిసిందే. ముఖ్యంగా మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైన నాటి నుండి ఏదొక బాలీవుడ్ హీరోయిన్ పేరు చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆ క్రమంలో ఇటీవల కాలంలో మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమాకు పరిణితి చోప్రా పేరు దాదాపుగా ఖరారైందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అయితే చివరికి అది కార్యరూపం దాల్చకపోవడం, ఆ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరడం జరిగిపోయాయి. తాజాగా అదే పరిణితి చోప్రా పేరు మరోసారి ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అయితే ఈ సారి మహేష్ బాబు సినిమాకు కాదు, ‘బాహుబలి’తో మాంచి ఊపు మీదున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం! ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమాలో పరిణితి చోప్రా కధానాయికగా ఎంపికైందన్న సమాచారం టాలీవుడ్ వర్గాల్లో సందడి చేస్తోంది.

సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు యువీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తోన్న ఈ సినిమా హిందీ మార్కెట్ కోసమని పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లుగా ట్రేడ్ టాక్. మరి గతంలో మహేష్ సినిమా మాదిరి కాకుండా, ఈ సారి పక్కాగా పరిణితి చోప్రా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమన్న వార్తలు వినపడుతున్నాయి.