టాలీవుడ్ హీరోలకు పాన్ ఇండియా స్టార్ డమ్ రుచి చూపించింది ప్రభాస్. అప్పటి వరకు తెలుగుకే పరిమితం అయిన మన టాలీవుడ్ హీరోల రేంజ్‌ను అమాంతం పెంచేశాడు జక్కన్న రాజమౌళి. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇటు తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో మూవీని తెరకెక్కించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న రాధే శ్యామ్ కూడా ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో డార్లింగ్ మూవీ కోసం సినీ జనాలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
ఇప్పుడు అన్నీ కుదరడంతో ఈ సినిమాను మార్చి 11న రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ కోసం అన్ని భాషల్లో స్టార్లను రంగంలోకి దింపుతున్నాడు ప్రభాస్. ఈ మూవీకి వాయిస్ ఓవర్ చెప్పించేందుకు ఐదు భాషల్లో ఉన్న పెద్ద స్టార్లను ఈ సినిమా కోసం వాడేస్తున్నాడు డార్లింగ్. తెలుగులో మొదట్లో మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి ఆ బాధ్యతను తీసుకున్నాడు. ప్రభాస్‌కు, రాజమౌళికి ఉన్న స్నేహం వల్ల ఆయన ఈ పని చేస్తున్నారు.
ఇక అటు బాలీవుడ్‌లో అమితాబ్ బచన్‌తో వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నారు మూవీ మేకర్స్. బాలీవుడ్‌లో హైప్ తీసుకువచ్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక కన్నడలో స్టార్ హీరో శివరాజ్ కుమార్‌తో వాయిస్ చెప్పిస్తున్నారు. ఇది కూడా అక్కడ రాధేశ్యామ్‌కు బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మళయాలంలో పృథ్విరాజ్‌తో చెప్పిస్తున్నారు.
దీన్ని చూస్తుంటే అన్ని భాషల్లో ఇలా హీరోలు పక్క భాష హీరో కోసం రావడం నిజంగా ఆశ్చర్యమే అనిపిస్తోంది. గతంలో అయితే పక్క భాష హీరోలను తమ ప్రాంతంలో ఎదగనిచ్చే వారే కాదు. కానీ ఇప్పుడు ప్రతి భాషలో కూడా హీరోలు పక్క భాష వారికి బాగానే సాయం చేస్తున్నారు. గతంలో బాహుబలితో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు రాధేశ్యామ్ దాకా కొనసాగుతోంది. అయితే అప్పుడు ఇప్పుడు ప్రభాస్ కోసమే ఇలా అగ్ర తారలు రావడం ఇక్కడ విశేషం.